కొల్లాపూర్ రూరల్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు మొదటి లిఫ్టు దగ్గర రెండో పంపునకు సంబంధించిన సాంకేతిక సమస్యలు అధిగమించి వెట్‌రన్‌కు సిద్ధం చేశామని ప్రాజెక్టు ఈఈ లోకిలాల్ అన్నారు. శుక్రవారం ఆయన రెండో పంపు వెట్‌రన్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం రెండో పంపు ట్రయల్ రన్‌తోపాటు టెస్టు రన్ కూడా చేయడం జరిగిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో వెట్‌రన్ నిర్వహించి నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేస్తామన్నారు. రెండో పంపు వెట్‌రన్ తర్వాత వారంలో రోజుల అనంతరం మూడో పంపును సైతం సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. తద్వారా మొదటి లిఫ్టులో పూర్తయిన నాలుగు పంపుల నుంచి రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేస్తామని వెల్లడించారు.


