జిల్లాలో 67 పాఠశాలలు మూసివేత
ప్రీ ప్రైమరీలతో బలోపేతం..
అచ్చంపేట: తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్ ఉంటుందనేది నానుడి. గుడిలేని ఊరు ఉన్నా పర్వాలేదు కానీ.. బడి లేని గ్రామం ఉండకూడదని అంటారు పెద్దలు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ బడుల సంఖ్య పెరగాల్సి ఉండగా.. విద్యార్థులు లేరనే సాకుతో చాలా గ్రామాల్లో మూసేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే 67 బడులు మూతపడగా.. అదే బాటలో మరో 122 పాఠశాలలు సైతం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా 495 ప్రాథమిక, 124 ప్రాథమికోన్నత, 130 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా.. 25,102 మంది బాలురు, 22,285 మంది బాలికలు విద్య అభ్యసిస్తున్నారు. ప్రతి ఏటా బడిబాట కార్యక్రమంతో పదిశాతం విద్యార్థులను అదనంగా సర్కారు బడుల్లో చేర్పించాల్సి ఉంది. అయితే అదనంగా విద్యార్థులను చేర్పించడం పక్కన పెడితే.. ఉన్న విద్యార్థులు తగ్గిపోయి పాఠశాలలు మూతపడుతున్నాయి.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 2024–25 విద్యా సంవత్సరం 816 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 2025–26 విద్యా సంవత్సరానికి వచ్చే సరికి 749 మిగిలాయి. జిల్లావ్యాప్తంగా 67 ప్రాథమిక పాఠశాలలకు విద్యార్థులు రావడం లేదని మూసేశారు. మరో 122 పాఠశాలల్లో 10 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. అంటే వాటిని కూడా మూసేసే పరిస్థితి దాపురించింది. మరో 119 బడుల్లో సైతం 20 మందిలోపు విద్యార్థులు ఉన్నారు. వాటిలో కూడా విద్యార్థులు లేరనే నెపంతో మూసివేయరాదని.. ఒక్కో పాఠశాలలో 10శాతం విద్యార్థుల సంఖ్య(ఎన్‌రోల్‌మెంట్) చేయాలని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులను ఉన్నతాధికారులు ఆదేశించారు. 20 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలు 534 ఉండగా.. మొత్తం 3,202 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
నల్లమలలోనే అత్యధికంగా..
జిల్లాలో అత్యధికంగా నల్లమలలోనే పాఠశాలలు మూతపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 67 స్కూల్స్ జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉండగా.. ఒక అచ్చంపేట మండలంలోనే 18 ఉన్నాయి. మండలంలో మొత్తం 52 ప్రాథమిక, 14 ప్రాథమికోన్నత, 6 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 18 బడుల్లో జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో మూతపడ్డాయి. దుబ్బుతండా, లింగనోనిపల్లి, దర్శన్‌గడ్డ, దేశ్యాతండా, ఒంకమూతితండా, ధన్యాలతండా, మర్లపాడుతండా, డొక్కుతండా పాఠశాలల్లో విద్యార్థులు లేని కారణంగా మూసివేసి.. 8మంది ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై ఇతర పాఠశాలకు పంపించారు. చీన్యాతండా, కేశ్యాతండా, నక్కర్లపెంట, పద్మారం తండా, కొర్రతండా, లింగోటం తండా, చౌటపల్లి తండా, శంకరయ్యగుట్ట తండా, మైలకుంట తండా, బాల్యతండా పాఠశాలలు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు లేక మూతపడ్డాయి.
ఈ ఏడాది తగ్గిన విద్యార్థులు..
ప్రభుత్వ పాఠశాలల్లో 2025–26లో 75,347 మంది విద్యార్థులు ఉండగా.. ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు 69,370 మంది విద్యార్థులు మాత్రమే నమోదయ్యారు. అంటే గతేడాది కంటే 5,977 మంది విద్యార్థులు తగ్గారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే బడీడు పిల్లలను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరంలో ఆశించిన స్థాయిలో విద్యార్థులను చేర్పించడంలో ఉపాధ్యాయులు వెనకబడ్డారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అదే బాటలో మరో 122 బడులు
బడీడు పిల్లలను పాఠశాలల్లో
చేర్పించడంలో విఫలం
నానాటికీ సన్నగిల్లుతున్న సర్కారు విద్య
ప్రైవేటుకు ధీటుగా సర్కారు బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ఏర్పాటుచేశారు. జిల్లాలో గతేడాది 21 ప్రీ ప్రైమరీ బడులను ఏర్పాటుచేయగా.. ఈ ఏడాది ఏకంగా 77 పాఠశాలలను ఏర్పాటుచేశారు. దీంతో వాటి సంఖ్య 98కి చేరింది. ప్రీ ప్రైమరీ తరగతులతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయని అధికారులు భావిస్తున్నారు.


