ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకపోతే ఓటు లేనట్టే
మా ఓటు ఊళ్లోనే ఉంచుకుంటాం.. ఇక్కడ అక్కర్లేదు.. అంటూ పట్టణాల్లో స్థిరపడిన వారు బీఎల్‌ఓలకు స్పష్టం చేస్తున్నారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఏదో ఒకచోట మాత్రమే ఓటుహక్కు కలిగి ఉండాల్సి ఉండటంతో చాలామంది సొంతూళ్లనే ఎంచుకుంటున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు సైతం సర్ ఫారాలు నింపేందుకు గ్రామాల బాట పట్టారు. ఎన్నికల సమయంలో పట్టణ ప్రాంతాల్లో ఓటు వేయమని కూడా అడిగే వారే ఉండరని, ఊళ్లో అయితే మమల్ని వెతుక్కుంటూ వస్తారని అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లు పల్లెలోనే ఉండాలంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజాప్రతినిధులు, నాయకులే ఇప్పిస్తారని, పట్టణాల్లో అయితే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు. పట్టణంలో అన్నీ ఉన్నా ఓటు మాత్రం ఊళ్లోనే ఉండాలని పేర్కొంటున్నారు.
అచ్చంపేట: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలు నింపి బీఎల్‌ఓలకు అందజేస్తేనే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు ఉంటుంది. లేదంటే ఓటరు లిస్టులో మీ పేరు కనిపించదు. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోతే ఫాం–6 ద్వారా ఆగస్టు, సెప్టెంబర్‌లో మళ్లీ ఓటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడా చూసినా ఇదే అంశంపై చర్చ జరుగుతుంది. సర్‌లో భాగంగా ఇంటింటికి వెళ్లి వందశాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసినట్లు ఎన్నికల అధికారులకు పంపించిన నివేదిక పేర్కొంటుంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. బీఎల్‌ఓలు ఇప్పటి వరకు 60 శాతం కూడా ఎన్యూమరేషన్ పత్రాలు సంబంధిత ఓటర్లకు అందజేయలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఇది ఎక్కువగా పట్టణాల్లో వినిపిస్తోంది. ఇల్లు మారిన ఓటర్లు చాలామంది పాత ఇళ్లకు చెందిన బీఎల్‌ఓల వద్దకు వెళ్లి పత్రాలు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. అలాగే కొన్ని కుటుంబాల్లో కొందరికే పత్రాలు అందాయి. ప్రతి ఇంటికి మూడు సార్లు తిరిగి పత్రాలు ఇస్తారనే నిబంధనలు బీఎల్‌ఓలకు క్షేత్రస్థాయిలో సాధ్యం కావడం లేదు. ఒక్కో బూత్‌కు సుమారు 800 నుంచి 1,200 మంది ఓటర్లు ఉన్నారు. ఇంటింటికి ఇవ్వడంతోపాటు తిరిగి తీసుకుంటున్న పత్రాలు డిజిటలైజేషన్ చేయడంలో చిక్కులు ఎదురవుతున్నాయి. దీనికితోడు సర్వర్ పనిచేయకపోవడం వంటి సమస్యలతో బీఎల్‌ఓలు సతమతమవుతున్నారు. ఎక్కువ సమయం ఇక్కడే వృథా అవుతున్నట్లు వారు వాపోతున్నారు. సర్ ప్రక్రియలో భాగంగా గతనెల 25న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ ప్రారంభం కాగా.. ఈ నెల 24 వరకు పూర్తి చేయాల్సి ఉంది. కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉండటంతో గడువులోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు.
పల్లెల్లోనే ఓటు పదిలం..
ఈ నెల 24 వరకు
ఫారాలు ఇవ్వాలని ఆదేశం
ఎస్‌ఐఆర్‌కు 10 రోజుల సమయం
జిల్లాలో చాలామందికి చేరని పత్రాలు
సర్వర్ డౌన్‌తో సతమతమవుతున్న బీఎల్‌ఓలు


