2022–23 యాసంగి సీఎంఆర్‌పై ప్రభుత్వం అల్టిమేటం!
1,61,009 మె.ట. ధాన్యం కేటాయింపు..
జిల్లావ్యాప్తంగా 72 రైస్‌మిల్లులు, 11 పారాబాయిల్డ్ మిల్లులు ఉన్నాయి. 2022–23 యాసంగి సీజన్‌లో పండిన వరిధాన్యాన్ని ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. దాదాపు 1,61,009 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మిల్లర్లకు అప్పగించింది. వీటిని సీఎంఆర్ రూపంలో ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. వీటిలో కొందరు రైస్‌మిల్లర్లు 18,960 మెట్రిక్ టన్నులను మరాడించి ప్రభుత్వానికి బియ్యం అప్పగించారు. 22,047 మెట్రిక్ టన్నుల ధాన్యానికి వేలం వేశారు. ఇంకా దాదాపు 1,11,395 మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. ఆ ధాన్యం విలువను ప్రభుత్వం రూ. 250కోట్లుగా లెక్కించింది.
వచ్చేనెల 8తో
గడువు ముగింపు
బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం విధించిన 90రోజుల గడువు వచ్చేనెల ఆగస్టు 8తో ముగుస్తుంది. ఇటీవల జిల్లాకేంద్రంలో విజిలెన్స్ డీఎస్పీ నేతృత్వంలో మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో గడవులోగా బకాయి ఉన్న 79 రైస్‌మిల్లర్లు రూ. 250కోట్లు చెల్లించాలని.. లేనిచో మిల్లులపై ఉన్న బకాయికి 25శాతం అదనంగా చెల్లించడంతో పాటు 12శాతం వడ్డీ సైతం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మిల్లర్లలో ఆందోళన మొదలైంది. సమస్య పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించారు.
కల్వకుర్తి: 2022– 23 యాసంగి సీజన్‌లో ప్రభుత్వం నుంచి రైస్‌మిల్లర్లు తీసుకున్న వరిధాన్యం పంచాయితీ తెగడం లేదు. మిల్లర్లు బకాయిపడిన సీఎంఆర్ మొత్తం అందించాలని.. లేదా తీసుకున్న ధాన్యం తిరిగివ్వాలని.. అదీ కుదరకపోతే డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ మేరకు గత మే 8న 90 రోజుల నిర్దిష్ట గడువు విధించింది. అప్పటిలోగా బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే ప్రస్తుతం మిల్లర్లు బకాయి సీఎంఆర్‌కు బదులు డబ్బులను చెల్లించేందుకే మొగ్గు చూపుతున్నారు. ఈ మేరకు అప్పట్లో వర్షానికి తడిసిన ధాన్యాన్ని అందించారని.. బియ్యం సక్రమంగా రావని.. క్వింటా రేటు తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాలో ధాన్యం తీసుకున్న రైస్‌మిల్లులు 83 ఉండగా.. మూడు మిల్లుల యాజమాన్యం కొంత ధాన్యం చెల్లించడంతో పాటు డబ్బులు చెల్లించి, క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందారు. మిగతా 79 మిల్లులపై రూ. 250కోట్ల బకాయి ఉంది. కొన్ని మిల్లులకు రూ. 10లక్షలలోపు ఉండగా.. మరికొన్నింటికి రూ.కోటి నుంచి రూ. 7కోట్ల వరకు బకాయి ఉన్నాయి. ఇక కొన్ని పారాబాయిల్డ్ మిల్లులు రూ. 13కోట్ల నుంచి రూ. 23.54 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే ఎనిమిది మిల్లులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ రాజయ్య తెలిపారు. మరో నాలుగు మిల్లులపై సైతం కేసులు చేయాల్సి ఉందన్నారు. 36 మిల్లులకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.
రైస్‌మిల్లర్లకు నోటీసులు
మొత్తం రూ. 250కోట్లు చెల్లించాలని ఆదేశం
వచ్చేనెల 8వరకు గడువు
8 మిల్లులపై కేసులు..


