సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లా విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో బదిలీల లొల్లి తారస్థాయికి చేరింది. సూపరింటెండెంట్ ఇంజనీర్ ట్రాన్స్‌ఫర్ అయ్యే ఒక్క రోజు ముందు జిల్లా స్థాయిలో చేసిన బదిలీలు వివాదాస్పదంగా మారాయి. విద్యుత్ సంస్థలో బదిలీలపై నిషేధం ఉన్నప్పటికీ.. ఏకపక్షంగా చేపట్టారని ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు ఎస్‌ఈ సీటు ఆరు రోజులుగా ఖాళీగా ఉండడం.. కనీసం ఇన్‌చార్జిగా ఎవరికీ బాధ్యతలు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే..
గద్వాల సర్కిల్ సూపరిండెంట్ ఇంజినీర్ శ్రీనివాసరెడ్డి జూన్ 30వ తేదీన హైదరాబాద్‌కు బదిలీ కాగా.. ఈ నెల ఒకటో తేదీన బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. అయితే ఎస్‌ఈ బదిలీ ఉత్తర్వుల కంటే కంటే ఒక రోజు ముందే డిస్పాచ్‌లతో ఇద్దరు జేఏఓలు, ఒక లైన్‌మన్, ఒక ఆర్టీజన్‌కు బదిలీ చేసినట్లు.. ఈ నెల 2వ తేదీన విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి ఆర్టీజన్ ఫీల్డ్‌లో పని చేయాల్సి ఉంటుంది. కానీ సిస్టం వర్క్ వస్తదనే కారణంతో ఎస్‌ఈ కార్యాలయంలో చేస్తున్నారు. తాజాగా మళ్లీ స్టోర్ రూమ్‌కు బదిలీ కావడం అనేక ప్రశ్నలకు తావిస్తోంది.
3 రోజులుగా ఆందోళనలు..
ఎస్‌ఈ బదిలీ అయిన తర్వాత పాత తేదీలతో తనకు అనుకూలంగా ఉన్న కిందిస్థాయి సిబ్బందిని ఏకపక్షంగా వ్యహరించి బదిలీ చేయడం అక్రమమంటూ ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. గద్వాల సర్కిల్‌లో అక్రమ బదిలీలను నిలిపివేయాలంటూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఎస్‌ఈ కార్యాలయం వద్ద ఉద్యోగులు మూడు రోజులుగా పోరు కొనసాగిస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లారు. అయితే సీఎం మీటింగ్ ఉందంటూ దాటేస్తూ సీఈ కలవలేదని సమాచారం.
6 రోజులుగా కుర్చీ ఖాళీ..
గత నెల 30న గద్వాల ఎస్‌ఈ శ్రీనివాస్‌రెడ్డి బదిలీపై వెళ్లారు. అయన స్థానంలో వేణుగోపాల్ పదోన్నతిపై ఇక్కడికి రావాల్సి ఉంది. కానీ ఆయన జాయిన్ కాలేదు. ఈ క్రమంలో సీఈ ఇన్‌చార్జిగా వ్యవహరించడం ఆనవాయితీ. లేదంటే కనీసం అక్కడున్న డీఈకి తాత్కాలికంగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. కానీ ఇప్పటివరకూ ఎవ్వరికీ బాధ్యతలు అప్పగించకపోవడం.. ఆరు రోజులుగా ఎస్‌ఈ కుర్చీ ఖాళీగా ఉండడం.. విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేస్తుండడంతో పలు సమస్యలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది.
గద్వాల విద్యుత్ శాఖలో హైటెన్షన్
ఇటీవల సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్‌రెడ్డి బదిలీ
ఒక్కరోజు ముందు తేదీతో జిల్లాస్థాయిలో నలుగురికి ట్రాన్స్‌ఫర్ ఉత్తర్వులు
నిబంధనలకు విరుద్ధంగా వివక్షతో వ్యవహరించారని ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ఆ సీనియర్ అధికారే కారణమా?
గద్వాల సర్కిల్‌లో ప్రస్తుతం చోటుచేసుకున్న బదిలీలకు సర్కిల్‌లోని అకౌంట్ సెక్షన్‌లో ఉన్న ఓ సీనియర్ అధికారి కారణమనే చర్చ విద్యుత్ ఉద్యోగుల్లో జరుగుతోంది. గతంలో గద్వాల డివిజన్ కార్యాలయంలో ఉన్న ఓ అధికారిణి సరిగ్గా విధులకు హాజరు కావడం లేదని ఆ డివిజన్ డీఈ ఫిర్యాదు చేస్తే.. సదరు సీనియర్ అధికారి తన పలుకుబడితో ఎస్‌ఈ ద్వారా తన సెక్షన్‌కు బదిలీ చేయించారనేది అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా వివాదంగా మారిన బదిలీల్లో ఆ సీనియర్ అధికారి హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది.


