కల్వకుర్తి టౌన్/ఉప్పునుంతల: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని డీఈఓ రమేశ్‌కుమార్ అన్నారు. మంగళవారం కల్వకుర్తి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి పాఠశాల నిర్వహణ, కల్పిస్తున్న సౌకర్యాలు, హాస్టల్ నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలుచేయాలని కేజీబీవీ సిబ్బందికి సూచించారు. వంటశాల పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వొద్దని తెలిపారు. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించడంతో పాటు నాణ్యమైన ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విధంగా ఉప్పునుంతల మండలం తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆయన టై, బెల్టులను పంపిణీ చేశారు. తరగతి గదిలో విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. డీఈఓ వెంట ఎంఈఓలు శంకర్ నాయ క్, శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ అలివేలమ్మ, కేజీబీవీ ఎస్‌ఓ రమాదేవి, హెచ్‌ఎం రామస్వామి ఉన్నారు.


