కందనూలు: విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను జాతీయస్థాయిలో గుర్తించి, సత్కరించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రతిష్ఠాత్మకంగా అందజేస్తున్న జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రమేశ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ నెల 10వ తేదీలోగా http://nationalaward sotŠreacherr. education.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 90101 92288 నంబర్‌ను సంప్రదించాలని ఆయన తెలిపారు.
అక్రమాలపై
విచారణ జరపాలి
కందనూలు: మొక్కజొన్న కొనుగోళ్లలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ జరపాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై అంబేడ్కర్ సాక్షిగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతును రాజును చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. కాగా, అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బయలుదేరిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసి శ్రీశైలం, ప్రదీప్, మాధవరెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
పెంపుడు జంతువులతో అప్రమత్తంగా ఉండాలి
కందనూలు: పెంపుడు జంతువులతో ప్రబలే వ్యాధుల బారినపడకుండా పెంపకందారులతో పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయ ప్రాంగణంలో పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుక్కలు, పిల్లులు, కోతులు తదితర జంతువులు కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే సబ్బు నీటితో శుభ్రంగా కడిగి, సమీపంలోని ఆరోగ్యకేంద్రంలో యాంటీ రాబిస్ టీకా వేయించుకోవాలని సూచించారు. జంతువుల ద్వారా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాబిస్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, కోవిడ్ 19, ఆంత్రాక్స్, లెప్టో స్ప్రేరోసిస్ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ముందుజాగ్రత్త పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డా.జ్ఞానేశ్వర్, ప్రోగ్రాం అధికారి డా.కృష్ణమోహన్ పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు అన్ని వసతులు
తిమ్మాజిపేట: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికులకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు మహబూబ్‌నగర్ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ అన్నారు. సోమవారం తిమ్మాజిపేట బస్టాండ్‌ను ఆయన పరిశీలించారు. నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్ యాదయ్య, స్థానిక దాతల సహకారంతో ఇటీవల బస్టాండ్‌ను పునరుద్ధరించగా.. బస్టాండ్ ప్రాంగణం, పరిసరాల్లో సీసీ నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి రూ. 39లక్షలు మంజూరు చేయించారు. ఈ నెల 8న జిల్లా పర్యటనకు వస్తున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతులమీదుగా సీసీ నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే సూచించగా.. ఆర్‌ఎం బస్టాండ్‌ను సందర్శించి పరిశీలించారు. ఆయన వెంట రాష్ట్ర టెలికాం బోర్డు సభ్యుడు శ్రీనివాస్ బహదూర్, లక్ష్మీనారాయణ, కంట్రోలర్ తిరుపతయ్యగౌడ్, రాములు ఉన్నారు.


