ఆకలి తీరేదెన్నడో..? | - | Sakshi
Sakshi News home page

ఆకలి తీరేదెన్నడో..?

Jul 5 2026 8:02 AM | Updated on Jul 5 2026 8:02 AM

జూనియర్‌ కళాశాలల్లో

అమలుకాని మధ్యాహ్న

భోజన పథకం

మధ్యాహ్నమే వెళ్లిపోతున్నాం..

ఆదేశాలు రాలేదు..

అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు

గ్రామీణ ప్రాంతాల వారికి

మరిన్ని అవస్థలు

రవాణాపరమైన ఇబ్బందులతో

హడావుడిగా రాకపోకలు

త్వరగా ప్రవేశపెట్టాలని తల్లిదండ్రుల వేడుకోలు

కందనూలు: ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే.. జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, నేటికీ అమలు కాకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా.. అందులో 3,842 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులు రవాణా పరమైన ఇబ్బందులతో ఉదయమే కళాశాలకు రావాల్సి ఉంటుంది. దీంతో ఆ సమయానికి ఇంట్లో వంట కాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం అన్నం లేకుండానే కళాశాలకు వస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కళాశాలలో ఉండి పాఠ్యాంశాలు విని తిరిగి ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం అవుతుంది. విద్యాసంస్థలు ప్రారంభమై ఇప్పటికే నెల గడుస్తున్నా ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు తమ ఇబ్బందులను అర్థం చేసుకొని మధ్యాహ్న భోజనాన్ని కళాశాలలో ప్రారంభించాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు..

గత కొన్నేళ్లుగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. కళాశాల అధ్యాపకులు ఇంటింటికి తిరుగుతూ కళాశాలలో సాధించిన మార్కులను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియజేస్తూ అడ్మిషన్లు తీసుకుంటున్నారు. కళాశాలకు పూర్వవైభవం రావాలంటే మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాలని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో ఉండి తిరిగి వెళ్లే వరకు విద్యార్థులు ఆకలితో పస్తులుండాల్సి వస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి వరకు ఆకలితో అలమటిస్తున్నారు. కొందరు బస్సు వచ్చే సమయాన్ని బట్టి అంతకు ముందుగానే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు అమలు కాకపోవడంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు.

మధ్యాహ్నం భోజనం అమలు చేస్తే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిరోజు కళాశాలకు వచ్చి బాగా చదువుకునే అవకాశం ఉంటుంది. కొంత మందిమి ఆకలి కావడంతో మధ్యాహ్నం సమయంలోనే ఇంటికి వెళ్తున్నాం. ఆ సమయంలో క్లాసులు మిస్సవుతున్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి త్వరగా అమలు చేయాలని కోరుతున్నాం.

– అరుణ్‌కుమార్‌, బాలుర జూనియర్‌ కళాశాల, నాగర్‌కర్నూల్‌

జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మ ధ్యాహ్న భోజనం పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. త్వరలో ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన వెంటనే అమలు చేస్తాం.

– వెంకటరమణ, డీఐఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement