బాలలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ హెచ్చరించారు. గురువారం ఊర్కొండ మండలంలోని పలు ఇటుక బట్టీల్లో ఆయన స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఇటుక బట్టీల్లో ఎవరైనా బాలలను పనుల్లో పెట్టుకున్నారా అని ఆరా తీశారు. అక్కడ పనిచేస్తున్న కార్మికుల వివరాలు, వారి పిల్లల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నెల రోజులపాటు కొనసాగుతుందని.. చిన్నారులను బడికి పంపించి వారి భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు. ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే పోలీసు అధికారులు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని సూచించారు.


