ప్రజావాణికి బారులు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణికి బారులు

Jun 30 2026 3:05 AM | Updated on Jun 30 2026 3:05 AM

స్వయంగా కలెక్టర్‌తో గోడు వెల్లబోసుకున్న జనం

ఫిర్యాదుదారులతో కలెక్టరేట్‌ కిటకిట

కందనూలు: సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జనం బారులు తీరారు. స్వయంగా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌కు వినతిపత్రాలు సమర్పించి.. తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రధానంగా భూ సంబంధిత సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి, చేయూత పింఛన్లు, రెవెన్యూ తదితర సమస్యలపై 62 అర్జీలు అందగా.. సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో కలెక్టరేట్‌ కిటకిటలాడింది.

ఇంటిని ఖాళీ చేయంటున్నారు..

వికలాంగురాలినైన నేను దోమలపెంటలో 30 ఏళ్ల నుంచి పాడుబడిన ఇంట్లో ఉంటున్నాను. ఆ ఇంట్లో ఉండమని గత కలెక్టరే చెప్పారు. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త కూలీ పనిచేయగా వచ్చిన డబ్బులతో బతుకుతున్నాం. ఇప్పుడు ఆ ఇంటిని ఖాళీ చేయమని ఇరిగేషన్‌శాఖ వారు నోటీసులు ఇచ్చారు. మాకు ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలి. – కొండేటి సంతోషమ్మ,

దోమలపెంట, అమ్రాబాద్‌ మండలం

బాట నుంచి రానిస్తలేరు..

నేను 20 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి వద్ద 5 ఎకరాల పొలం కొన్నా. అప్పటి నుంచి నేను మా పొలానికి ఉన్నటువంటి బాట నుంచి వెళ్తున్నా. కొన్ని రోజులుగా మా పక్క పొలం అతను మీకు బాట లేదు.. ఎక్కడి నుంచైనా వెళ్లాలని.. ఈ బాట నుంచి పోనివ్వనని ఇబ్బంది పెడుతు న్నారు. అధికారులు స్పందించి నా సమస్య పరిష్కరించాలి. – కాళ్ల పెద్దరాములు,

జూపల్లి, చారకొండ మండలం

దివ్యాంగుల భవనం ఏర్పాటుచేయాలి..

జిల్లాలో దివ్యాంగుల సమస్యలపై సమావేశాలు నిర్వహించుకోవాలంటే సొంత భవనం లేదు. మాకు జిల్లాలో కమిటీ హాల్‌ ఏర్పాటు చేయాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. దివ్యాంగులైన మేము పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. మా సమస్యలు పరిష్కరించాలి. – జిల్లా దివ్యాంగుల పరిరక్షణ కమిటీ

ఇందిరమ్మ ఇల్లు ఇప్పించండి..

నాకు మా ఊరిలో ఇల్లు లేదు. నేను వికలాంగురాలిని. 30 ఏళ్ల నుంచి కిరాణషాపు నడుపుకొని జీవనం కొనసాగిస్తున్నా. అధికారులు స్పందించి నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేసి ఆదుకోవాలి. – అనిత, యాపట్ల, పెద్దకొత్తపల్లి మండలం

న్యాయం చేయండి సారూ..

జిల్లాలోని మంగనూరు, గంగారం, లట్టుపల్లి, వడ్డేమాన్‌, బిజినేపల్లి, తిమ్మాజిపేట, అవంచ తదితర గ్రామాల్లో 100 మందికి పైగా రైతులు పండించిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని బిజినేపల్లికి చెందిన అరవింద్‌, శివాజీ, మంగనూర్‌కు చెందిన ఎండీ హాసన్‌ కొనుగోలు చేశారు. తేమ, తరుగు పేరుతో తక్కువ ధర నిర్ణయించినా.. వెంటనే డబ్బులిస్తామని చెప్పడంతో నమ్మి సుమారు రూ. 2కోట్ల విలువైన ధాన్యాన్ని కట్టబెట్టాం. తీరా డబ్బులివ్వమంటే అప్పుడు, ఇప్పుడు అంటూ రశీదులు మాత్రం ఇచ్చారు. ఈ నెల 22న బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటూ కొందరు రైతులకు చెక్కులు ఇచ్చారు. బ్యాంక్‌కు వెళ్తే వారి ఖాతాలో డబ్బులు లేవని చెబుతున్నారు. ఆ తర్వాత వారు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రావడం లేదన్నారు. తీరా తమ వద్ద ధాన్యం కొనుగోలు చేసిన దళారుల్లో హాసన్‌ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని.. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిసింది. మాకు న్యాయం చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement