నేడు పల్స్‌పోలియో
● జిల్లాలో 1,00,624 మంది
చిన్నారుల గుర్తింపు
● ఏర్పాట్లు పూర్తిచేసిన
జిల్లా వైద్యారోగ్యశాఖ
కందనూలు: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో కార్యక్రమానికి వైద్యారోగ్యశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కల మందు వేసేందుకు పక్కా ప్రణాళికలు రూపొందించింది. చిన్నారుల నిండు జీవితానికి తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలని.. తద్వారా పోలియో మహమ్మారిని నిర్మూలించవచ్చని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
613 కేంద్రాల ఏర్పాటు..
జిల్లావ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసు గల 1,00,624 మంది చిన్నారులను గుర్తించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, సబ్‌సెంటర్లు, జిల్లా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పరిధిలో పోలియో చుక్కలు వేసేందుకు గాను 613 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇందుకోసం 2,884 మంది సిబ్బందిని నియమించారు. ఆర్టీసీ బస్టాండ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉదయం 7 గంటల నుంచి చుక్కల మందు పంపిణీని ప్రారంభించనున్నారు. మొదటి రోజు మిగిలిపోయిన చిన్నారులకు 29, 30 తేదీల్లో వైద్యసిబ్బంది ఇంటింటికీ తిరిగి పోలియో చుక్కలు వేయనున్నారు. వలస కూలీ ల పిల్లలతో పాటు, వ్యవసాయ పనులు, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ కార్మికులు నివాసాలకు సైతం ప్రత్యేక బృందాలను పంపనున్నారు.
చిన్నారులకు చుక్కల మందు వేయించడం ద్వారా పోలియో రాదు. జీవితాంతం రక్షణతోపాటు అంగవైకల్యాన్ని నివారించవచ్చు. ఉచితమైన, సురక్షితమైన ఈ మందును చిన్నారులకు తప్ప నిసరిగా వేయించాలని వైద్యాధికారులు పెద్దఎత్తున ప్రచార కార్యక్రమం చేపట్టారు.
పోలియో చుక్కలు వేయించుకోకుండా జిల్లాలో ఏ ఒక్క చిన్నారి ఉండకూడదు. జిల్లాలోని ప్రధాన సెంటర్లతో పాటు రద్దీగా ఉన్న ప్రాంతాల్లో కూడా వైద్య బృందం పర్యటిస్తుంది. తల్లిదండ్రులు తమ చిన్నారులకు విధిగా చుక్కల మందు వేయించాలి. – కృష్ణ, డీఎంహెచ్‌ఓ
●


