తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
కొల్లాపూర్ రూరల్: వరిధాన్యంలో తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం కొల్లాపూర్ మండలంలోని కుడికిళ్ల, నార్లాపూర్ గ్రామాల్లో ఐకేపీ ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. నిబంధనల మేరకు తేమశాతం ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి.. మిల్లులకు తరలించాలన్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించిన రైతుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ అయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఎం అరుణ, సింగిల్‌విండో డైరెక్టర్ రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.


