బాధితులకు సత్వర న్యాయం అందాలి
● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల
పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దు
● ఎంపీ డా.మల్లు రవి
నాగర్‌కర్నూల్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించి.. బాధితులకు సత్వర న్యాయం అందించాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డా.మల్లు రవి అన్నారు. పీసీఆర్–1955, పీఓఏ యాక్ట్–1989 అమలుపై గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, కలెక్టర్ బదావత్ సంతోష్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు డా.వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ వేగవంతంగా చేపట్టి.. బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందేలా చూడాలన్నారు. అదే విధంగా అన్ని సంక్షేమ పథకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువత స్వయం ఉపాధి పథకాలను వినియోగించుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగితే వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి.. పరిహారంగా బాధితులకు రూ. 25వేలు చెల్లించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత ఆధికారులను ఆయన ఆదేశించారు. చార్జీషీట్ దాఖలయ్యాక 50 శాతం, కేసు పూర్తయ్యాక మిగతా మొత్తం చెల్లించేలా చూడాలన్నారు.
● ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అధికారులు కృషి చేయాలన్నారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ కేసుల వివరాలు, భూతగాదాలు, బాధితులకు అందించిన నష్టపరిహారం తదితర వివరాలను తెలుసుకున్నారు. కమిటీకి పలు సూచనలు చేశారు.
● ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో భూ తగాదాలను కమిటీ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై పోలీసు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
● కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 234 ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులు అందగా, 219 కేసులను అట్రాసిటీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. వాటిలో 170 కేసులకు చార్జీషీటు దాఖలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 219 కేసులకు పరిహారం అందించామని.. 19 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగతా అన్ని కేసులకు త్వరగా చార్జీషీటు వేసే విధంగా చూడాలని పోలీసుశాఖకు సూచించారు. అదే విధంగా గ్రామాల్లో పౌర హక్కులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అందుకు సంబంధించిన నివేదికను జిల్లా ఎస్సీ సంక్షేమశాఖకు అందజేయాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయం, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సభ్యులు ఎల్లపోగు వెంకటస్వామి, చిన్నగల్ల పరశురాం, గుమ్మకొండ రాములు, వెల్టూరి రేణయ్య, కె.చందర్, రెడ్యా తదితరులు ఉన్నారు.


