విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
కందనూలు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర విద్య పరిశోధనా సంస్థ డిప్యూటీ డైరెక్టర్, జిల్లా పరిశీలకురాలు రేవతిరెడ్డి అన్నారు. పాఠశాలల పరిశుభ్రత కోసం చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ 5.0పై గురువారం జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్, ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు, కేజీబీవీల ప్రత్యేకాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనతో పాటు భద్రత కల్పించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను తొలగించాలన్నారు. వంటగదుల శుభ్రత విషయంలోఅలసత్వం వహించొద్దన్నారు. రెండు రోజుల్లోగా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను నివేదించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు. అనంతరం డీఈఓ రమేశ్‌కుమార్‌తో కలిసి తాడూరు, నాగర్‌కర్నూల్, బిజినేపల్లి ఉన్నత పాఠశాలలను ఆమె తనిఖీ చేశారు. పాఠశాలల్లో అమలుచేస్తున్న పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమాలతో పాటు మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. అధికారులు వెంకటయ్య, మురళీధర్‌రెడ్డి, నర్సింహులు పాల్గొన్నారు.


