రేషన్ బియ్యం పక్కదారి!
నగదు పంపిణీ కేంద్రాలుగా మారిన చౌకధర దుకాణాలు
అచ్చంపేట: రేషన్ డీలర్ల తీరు మారడం లేదు. సన్నబియ్యం పంపిణీలోనూ అదే చేతివాటం.. అదే పక్కదారి కనిపిస్తోంది. అనేక చౌకధర దుకాణాల్లో ఎక్కువ శాతం బియ్యం పంపిణీ కాకుండా.. నగదు దందా బాహాటంగా కొనసాగుతోంది. కొందరు రేషన్ కార్డుదారులు ఈపాస్ యంత్రంపై బయోమెట్రిక్ (వేలిముద్ర) పెట్టి నెలవారీ బియ్యం కోటాను డీలర్లకు అప్పగించి.. నగదు పుచ్చుకోవడం పరిపాటిగా మారింది. డీలర్లు కూడా కిలోకు రూ. 20 నుంచి రూ.22 చొప్పున లెక్కగట్టి నగదు అందించడం సర్వసాధారణమైంది. నల్లబజారులో రూ.25 నుంచి రూ. 30 వరకు అమ్ముకుంటున్నారు. లబ్ధిదారులు రేషన్ బియ్యంపై అనాసక్తి కనబర్చడం డీలర్లకు కలిసివస్తోంది. జిల్లాలో 60 శాతం మంది మాత్రమే రేషన్ బియ్యం తింటున్నారు. మిగతా 40శాతం నల్లబజారుకు తరలుతోంది. ఈ దందాను కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీస్ శాఖలు చేతివాటం ప్రదర్శిస్తున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
సన్నబియ్యంపై కూడా..
పూట గడవని అత్యంత నిరుపేద కుటుంబాలు మినహా మిగతా కుటుంబాలు రేషన్ బియ్యం వండుకొని తినడానికి ఆసక్తి చూపడం లేదు. మొన్నటి వరకు బియ్యం దొడ్డుగా, నాసిరకం, ముక్కిపోయి ఉండటం, వండి తిన్న తర్వాత జీర్ణం కాకపోవడం లాంటి కారణాలతో పెద్దగా ఆసక్తి కనబరిచేవారు కాదు. కొన్ని కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యాన్ని కేవలం ఇడ్లీ, దోశలు, ఇతర పిండి వంటలకు వినియోగించేవారు. అయితే ప్రతినెలా ఉచితంగా అందుతుండటం.. అవసరానికి మించి వస్తుండటంతో డీలర్లకు అప్పగించి వచ్చేవారు. తాజాగా పంపిణీ చేస్తున్న సన్నబియ్యం అంత మంచిగా ఉండటం లేదని లబ్ధిదారులను కొందరు డీలర్లు తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఒక యూనిట్ మాత్రమే..
కొందరు కార్డుదారులు తమ నెలవారీ కోటాలో ఒక యూనిట్ బియ్యం మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మిగతా బియ్యాన్ని డీలర్లకు అప్పగించి నగదు పొందుతున్నారు. వాస్తవంగా చౌకధర దుకాణాల్లో ఈ–పాస్ (బయోమెట్రిక్) అమలు కంటే ముందు రేషన్ డీలర్లు దుకాణాల్లో మిగిలే బియ్యం, ఇతర సరుకులను గుట్టుచప్పుడు కాకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకునేవారు. సంస్కరణలో భాగంగా ఈ–పాస్ అమలుతో లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరీష్, ఓటి పీ తప్పనిసరి అయింది. దీంతో డీలర్లు లబ్ధిదారుల ప్రమేయంతో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు.
మొత్తం
రేషన్‌కార్డులు 2,72,487
అంత్యోదయ 18,701
ప్రతినెలా అందిస్తున్న బియ్యం 45,575.893
మెట్రిక్ టన్నులు
లబ్ధిదారులు 8,76,394
లబ్ధిదారుల అనాసక్తిని సొమ్ము
చేసుకుంటున్న రేషన్ డీలర్లు
కిలోకు రూ.20 నుంచి
రూ.22 చొప్పున కొనుగోలు
గుట్టుచప్పుడు కాకుండా
బ్లాక్ మార్కెట్‌కు తరలింపు
పట్టని పౌరసరఫరాలశాఖ


