మెడికిల్ దందా..
తనిఖీలు చేపడుతున్నాం..
రాసేది ఒకటి.. ఇచ్చేది మరొకటి..
జిల్లాలో ఇష్టానుసారంగా మెడికల్ షాపుల నిర్వహణ
●
సాక్షి, నాగర్‌కర్నూల్: జిల్లాలో మెడికల్ దందా జోరుగా సాగుతోంది. ఔషధ నియంత్రణశాఖ నిబంధనల మేరకు మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా ఫార్మసిస్టుల ద్వారా మందులను విక్రయించాల్సి ఉండగా.. అర్హత లేని వ్యక్తులతో దుకాణాలను నిర్వహిస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. జిల్లాలోని మెడికల్ షాపులపై సంబంధిత అధికారుల నియంత్రణ కరువైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తనిఖీలు అంతంతే..
జిల్లావ్యాప్తంగా 353 మెడికల్ దుకాణాలు ఉండగా.. మరో మూడు ఏజెన్సీలు ఉన్నాయి. వీటిలో సుమారు 90 శాతం షాపుల్లో ఫార్మసిస్టులు లేకుండానే మందుల విక్రయాలు సాగుతున్నాయి. అనర్హులతో మెడికల్ షాపులు నిర్వహిస్తుండటంతో డాక్టర్ ఒక రకం రాస్తే.. రోగులకు మరోరకం మందులను అంటగడుతున్నారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో అనధికార మెడికల్ షాపులే ఎక్కువగా ఉంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌ఎంపీ, పీఎంపీలు మందుల దుకాణాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నా సంబంధిత అధికారుల నుంచి చర్యలు కరువయ్యాయి.
బినామీల పేరుతో దందా..
జిల్లాలోని కొన్నిచోట్ల అనుమతులు లేకుండా మెడికల్ షాపులు నిర్వహిస్తున్నా అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. చాలావరకు మెడికల్ షాపుల నిర్వహణకు డీ ఫార్మసీ, బీ ఫార్మసీ చదివిన వారి నుంచి సర్టిఫికెట్లు అద్దెకు తీసుకొని అనుమతులు పొందుతున్నారు. నిబంధనల మేర కు ఫార్మసిస్టులతో మందులు ఇవ్వాల్సి ఉండగా.. మెడికల్ షాపుల్లో ఎక్కడా ఫార్మసిస్టులు కనిపించడం లేదు. మందుల కాంబినేషన్ కూడా సరిగ్గా తెలియని వ్యక్తులు రిటైల్‌గా మందులు విక్రయిస్తుండటం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది.
జిల్లాలోని మెడికల్ షాపుల్లో ఆకస్మిక తని ఖీలు చేపడుతున్నాం. నిబంధనలు పాటించని వాటిపై చర్యలు తీసుకుంటున్నాం. డాక్ట ర్ ప్రిస్క్రిప్షన్ ఆధారంగా మెడికల్ షాపుల నిర్వాహకులు మందులు విక్రయించాలి. నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం.
– శ్రీకాంత్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్
జిల్లాలో ఏ మెడికల్, కిరాణా దుకాణానికి వెళ్లినా పారాసెటమాల్ నుంచి మత్తు టాబ్లెట్ల వరకు సులువుగా లభ్యమవుతున్నాయి. పిల్లలు అడిగినా షాపుల్లో మందులు విక్రయిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వరాదన్న నిబంధన ఎక్కడా అమలుకావడం లేదు. బ్రాండెడ్ మందుల పేరుతో జనరిక్ మందులను విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నిబంధనల ప్రకారం ఫార్మసీ కౌన్సిల్ గుర్తింపు ధ్రువపత్రంతో పాటు లైసెన్స్‌డ్ ఫార్మసిస్టు ద్వారానే మందుల విక్రయాలు జరపాలి. మెడికల్ షాపు కనీసం 10 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్వహించాలి. గడువు ముగిసిన మందులు, ఫిజీషియన్ శాంపిల్స్ అమ్మడానికి వీలులేదు. కనిష్ట ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సిన మందులను రిఫ్రిజిరేటర్లలోనే ఉంచి విక్రయించాలి. మందులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాల్సి ఉండగా.. చాలావరకు షాపుల్లో అడిగినా బిల్లు ఇవ్వడం లేదు.
కనిపించని ఫార్మసిస్టులు..
అర్హత లేని వారే మందుల విక్రయం
ప్రజల ప్రాణాలతో చెలగాటం
జిల్లావ్యాప్తంగా 353 మెడికల్ దుకాణాలు
మెడికిల్ దందా..
మెడికిల్ దందా..


