ముంపు బాధితులకు అండగా ప్రభుత్వం
పంటల పరిశీలన..
అచ్చంపేట: నక్కలగండి ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం అచ్చంపేట మండలం మర్లపాడుతండాను అదనపు కలెక్టర్ అమరేందర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నక్కలగండితండా, మర్లపాడుతండా, కేశ్యతండా, మన్నేవారిపల్లి గ్రామాల ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ప్రజల అవసరాలు, అభిప్రాయాలు, పునరావాసంపై ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు తాము ఈ ప్రాంతానికి వచ్చి ముంపు ప్రభావం, పునరావాస పనులు, పంట నష్టాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వానికి ప్రజల సంక్షేమమే ముఖ్యమని, ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వంతో నిరంతరం చర్చలు జరిపి, తమ పరిధిలో చేయాల్సిన పనులను ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తిగా అమలుచేస్తానని హామీ ఇచ్చారు. పునరావాసానికి సంబంధించిన ప్రతి పని పారదర్శకంగా, వేగంగా జరిగేలా స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ప్రజలకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడానికి ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూములను పరిశీలిస్తోందని చెప్పారు. పునరావాస కాలనీల్లో కేవలం ఇళ్ల నిర్మాణం మాత్రమే కాకుండా, నీటి సౌకర్యం, విద్యుత్, అంతర్గత రహదారులు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, కమ్యూనిటీ హాళ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించేలా చూస్తామన్నారు. పునరావాసం పూర్తయ్యే వరకు ప్రభుత్వం ప్రజల వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
నక్కలగండి ప్రాజెక్టు నుంచి ప్రవాహిస్తుతన్న నీరు, ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావాన్ని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. పత్తి, వరి వంటి ముఖ్య పంటలు పెద్దఎత్తున తడిసి దెబ్బతిన్న ప్రాంతాలను సందర్శించి, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులు ఎదుర్కొంటున్న నష్టాల స్థాయిని సమగ్రంగా అంచనా వేసి, రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి వివరాలతో నివేదికలు పంపామన్నారు. వ్యక్తిగత, చిన్న వ్యాపారాల వల్ల నష్టపోయిన వారు కూడా స్వయంగా వచ్చి తమ సమస్యలను వివరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మాధవి, తహసీల్దార్ సైదులు తదితరులు పాల్గొన్నారు.


