క్షయ రోగుల వ్యయంపై సర్వే | - | Sakshi
Sakshi News home page

క్షయ రోగుల వ్యయంపై సర్వే

Jul 15 2026 12:47 AM | Updated on Jul 15 2026 12:47 AM

వాజేడు: మండల పరిధిలోని పెదగంగారం సబ్‌ సెంటర్‌లో మంగళవారం క్షయ రోగుల వ్యయంపై సర్వేను డబ్ల్యూహెచ్‌ఓ కన్సల్టెంట్‌, ఎన్‌టీఈటీ తెలంగాణ ఆధ్వర్యంలో డాక్టర్‌ బెస్సీ నిర్వహించారు. చికిత్స సమయంలో క్షయ రోగుల నుంచి కుటుంబంపై పడుతున్న ఆర్ధిక భారం వివరాలను సేకరించారు. అదే సమయంలో వైద్య, ప్రయాణ, పోషకాహార, ఖర్చులతో పాటు ఉపాధిని కోల్పోయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బెస్సీ మాట్లాడుతూ సర్వే ద్వారా సేకరించే సమాచారంతో క్షయ రోగులకు భవిష్యత్తులో మెరుగైన సేవలతో పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటానికి ఉపయోగ పడుతుందన్నారు. ఆమె వెంట హెచ్‌ఈఓ వేణుగోపాల కృష్ణ, వెంకటేశ్వరరావు, తిరుపతి, శ్రీను సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఐటీడీఏ డీడీగా జనార్దన్‌

బాధ్యతల స్వీకరణ

ఏటూరునాగారం: ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ (ట్రైబల్‌ వెల్ఫేర్‌)గా దబ్బగట్ల జనార్దన్‌ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేస్తున్న ఫిరంగి ఉద్యోగోన్నతిపై ఇటీవల ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(టీడబ్ల్యూ)గా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో ఓడీ (ఆన్‌డ్యూటీ డిప్యూటేషన్‌) ప్రాతిపదికన మంచిర్యాల జిల్లా ట్రైబల్‌ డెవలప్‌మెంట్‌ అధికారిగా పనిచేస్తున్న జనార్దన్‌ నియామక ఉత్తర్వులు రద్దు అయ్యాయి. అదే విధంగా తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నుంచి అందిన ఆదేశాల మేరకు జనార్దన్‌ ఏటూరునాగారం ఐటీడీఏ డీడీ(ట్రైబల్‌ వెల్ఫేర్‌)గా వచ్చిన జాయినింగ్‌ రిపోర్టును పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పోకు అందజేసి విధుల్లో చేరారు. అనంతరం పీఓకు మర్యాదపూర్వకంగా మొక్కను అందజేశారు.

నేటి నుంచి

శాకంబరీ ఉత్సవాలు

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ భద్రకాళి దేవాలయంలో బుధవారం శాకంబరీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఉదయం భద్రకాళి అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు సహస్ర కలశాభిషేకంలో ఉపయోగించే వేయి మృత్తికా ఘటాలకు సూత్ర వేష్ఠనం (కుండలకు దారాలు చుట్టడం) జరిపారు. రాత్రి 7 గంటలకు ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు రంగులలో సర్వాంగసుందరంగా మండల రచన చేశారు. చంద్రోదయం అనంతరం రాత్రి అంకురార్పణ జరిపారు.

ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో ప్రారంభం..

ఉదయం 5 గంటలకు నిర్మాల్య సేవలు, నిత్యాహ్నికం, ఉత్సవానుజ్ఞ ప్రార్థనతో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయి. గౌరీగణపతి పూజ, చతుఃస్థానార్చన పూజలు, ఉదయం 10 గంటలకు అమ్మవారి సహస్ర కలశాభిషేకం చేయనున్నారు.

ఉదయం, సాయంత్రం పూజలు

శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం అమ్మవారిని వివిధ కాళీక్రమాల్లో ఆరాధిస్తారు. ప్రతి క్రమానికి ప్రత్యేకత ఉండడం విశేషం. జూలై 29 వరకు జరిగే శాకంబరీ పూజల్లో భాగంగా బుధవారం ఉదయం కాళీ క్రమం, కామేశ్వరీ నిత్యాక్రమంలో పూజలు చేస్తారు. 16న కపాలినీ క్రమం, భగమాలినీ క్రమం, 17న కుల్లా క్రమం, నిత్యక్లిన్నా క్రమం, 18న కురుకుల్లా క్రమం, భేరుండా క్రమం, 19న విరోధిని క్రమం, వహ్నివాసినీ క్రమం, 20న విప్రచిత్తా క్రమం, మహావజ్రేశ్వరి క్రమం, 21న ఉగ్రా క్రమం, శివదూతీ క్రమం, 22న ఉగ్రాప్రభా క్రమం, త్వరితా క్రమం, 23న దీప్తా క్రమం, కులసుందరీ క్రమం, 24న నీలా క్రమం, 25న ఘనా క్రమం, నీలపతాకా, 26న బలాకా , విజయా క్రమం, 27న మాత్రా క్రమం, సర్వమంగళా క్రమం, 28న ముద్రా క్రమం, జ్వాలామాలినీ క్రమం, 29న మితాక్రమం, చిత్రానిత్యా క్రమాలలో పూజలు నిర్వహించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement