మల్హర్: తాడిచర్ల–2 కోల్‌బ్లాక్ తెలంగాణకు మణికిరీటంగా నిలుస్తుందని, తాడిచర్ల–2 కోల్‌బ్లాక్‌ను సింగరేణికి అప్పగించడం సంతోషకరమైన విషయమని కేంద్రమంత్రి బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. సింగరేణి భరోసాయాత్రలో భాగంగా మంగళవారం మండల కేంద్రం తాడిచర్లలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తాడిచర్ల–2 నుంచి త్వరలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానుందన్నారు. ఈ గని ద్వారా సుమారు 2,000 శాశ్వత ఉద్యోగాలు, మరో 5,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. గని కార్యకలాపాలతో వేలాది వాహనాల రాకపోకలు పెరిగి స్థానికంగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఈ బ్లాక్‌ద్వారా సుమారు రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్ జరిగే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. భారతదేశంలోలోనే అతిపెద్ద కోల్‌బ్లాక్‌గా తాడిచర్ల–2 నిలుస్తుందని, ఇది ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న అద్భుత నిర్ణయమని కొనియాడారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, సింగరేణి సంస్థ, తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అవసరమైన అన్ని అనుమతులు, క్లియరెన్స్‌లు త్వరగా పొందిన అనంతరం సింగరేణి పనులు ప్రారంభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, రాష్ట్ర నాయకులు సునీల్‌రెడ్డి, నారాయణరెడ్డి, కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్‌రెడ్డి, మల్క మోహన్‌రావు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
కోల్‌బ్లాక్ ద్వారా
రూ.1.20 లక్షల కోట్ల టర్నోవర్
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి
జి.కిషన్‌రెడ్డి


