ములుగు: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీపీయూఎస్ జిల్లా అధ్యక్షురాలు వాంకుడోతు జ్యోతి, ప్రధాన కార్యదర్శి గోనె రవీందర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగంలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. పీఆర్‌సీ రిపోర్టును తక్షణమే విడుదల చేసి 51శాతం ఫిట్‌మెంట్ ప్రకటించాలని కోరారు. అలాగే పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల ఏర్పాటునకు అవసరమైన మౌలిక వసతుల కోసం గ్రాంట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల క్యాలెండర్ ప్రకటించాలని కోరారు. సమస్యలు పరిష్కారం కాకపోతే వచ్చేనెల 1న రాష్ట్ర స్థాయిలో చేపట్టనున్న మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు హెచ్చరించారు. ధర్నాలో సంఘం నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


