ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం
ములుగు రూరల్: ఇంటర్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి నాయిని వీరేందర్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షలపై చీఫ్ సూపరిండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 13వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరుగుతాయని, జిల్లాలో పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయా కేంద్రాల్లో 1,981 మంది ప్రథమ, 1,860 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు ఇద్దరు డీఈసీ మెంబర్లు, ఒకరు ఫ్లయింగ్ స్వ్కాడ్, ఒకరు సిట్టింగ్ స్వ్కాడ్ పని చేస్తారన్నారు. పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతాయని, పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు రాంపాక అవిలయ్య, రజిత, బాదావత్ అశోక్ తదితరులు ఉన్నారు.


