
బంధాలలో నేలకూలిన ఇల్లు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండల పరిధిలోని బంధాల గ్రామానికి చెందిన కుర్సం కాంతారావు ఇల్లు నేలకూలింది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి భోజనం చేసిన అనంతరం కాంతారావు కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుజామున ఒకసారిగా ఇల్లు కూలిపోతున్న శబ్ధం రాగానే మేల్కొని బయటకు పరిగెత్తగానే ఇల్లు నేలకూలింది. ఇంట్లోని వస్తువులు, వంట పాత్రలు ధ్వంసమయ్యాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు దెబ్బతిని కూలిపోయిందని, ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని బాధితుడు వేడుకున్నారు.