
అత్యవసర సేవలపై తక్షణమే స్పందించాలి
మంగపేట: అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు వైద్యసేవలు అందించేందుకు సమాచారం అందిన తక్షణమే స్పందించాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ నజీర్ 108, 102 సిబ్బందికి సూచించారు. మండలంలోని మంగపేట, చుంచుపల్లి, 108, 102 అంబులెన్సులను ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స కోసం అందించే మందులు, పరికరాలు అన్నీ అందుబాటులో ఉన్నాయో.. లేదో.. తెలుసుకుని కాలం చెల్లిన మందులను ఉంచుకోవద్దని సూచించారు. ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత పరికరాలు, మందులు పనిచేసేలా చూసుకోవాలన్నారు. అనంతరం వాహనాల పనితీరు, సిబ్బంది హాజరు, మందుల వివరాల రికార్డులను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా అత్యవసర వాహనాల కార్యనిర్వాహణ అధికారి రాజ్‌కుమార్, ఎడ్ల నరేష్, లోహిత, మంజుల, పైలెట్లు రాజేశ్వర్, భాస్కర్, రాజేష్, విగ్నేష్ ఉన్నారు.
ములుగురూరల్: మలేరియా, డెంగీ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపారావు అన్నారు. మండల పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో డెంగీ నిర్ధారణ కావడంతో శుక్రవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా నిల్వనీటిని తొలగించారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. దోమల నిర్మూలనకు చర్యలు చేపట్టి డెంగీ, మలేరియా వ్యాప్తిని అరికట్టాలని తెలిపారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి పరిసరాల పరిశుభ్రత, నీటి నిల్వలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా కీటక జనితనియంత్రణ అధికారి చంద్రకాంత్, వైద్యాధికారి ప్రసాద్, ఏఎంఓ దర్గరావు, సబ్ యూనిట్ అఫీసర్ సాంబయ్య, తదితరులు ఉన్నారు.

అత్యవసర సేవలపై తక్షణమే స్పందించాలి