
భారీగా పెరిగిన మద్యం టెండర్ల రుసుం
వైన్స్‌కు స్లాబ్‌ల వారీగా చెల్లించాల్సిన ఫీజు
నవంబర్‌తో ముగియనున్న గడువు
ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. స్థానిక సంస్థలకు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమై ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే మద్యం షాపుల టెండర్లకు వీలుండదనే ఆలోచనతో ప్రభుత్వం ముందస్తుగా నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న మద్యం పాలసీ విధానాన్నే అమలు చేయనుంది. 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు రెండేళ్ల కాలానికి మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. గతంలో ఉన్న దరఖాస్తు ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచారు. ఒక వ్యక్తి ఎన్ని మద్యం దుకాణాలకైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
లాటరీ పద్ధతిన ఎంపిక..
మద్యం దుకాణాలను గతంలో మాదిరిగానే ఈ సారి కూడా లాటరీ పద్ధతిన ఎంపిక చేయనున్నారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులు తీసుకుని పరిశీలిస్తారు. అన్ని సక్రమంగా ఉన్నాయని నిర్ధారించిన దరఖాస్తులను ఫైనల్ చేస్తారు. ఆయా మద్యం దుకాణాల వారీగా నంబర్లతో డబ్బాల్లో వేసి దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీస్తారు.
వెంకటాపురం(ఎం): స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నూతన మద్యం పాలసీకి ముందుగానే టెండర్లు ఆహ్వానించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రస్తుత దుకాణాల లైసెన్స్ కాలపరిమితి ఈ ఏడాది నవంబర్ 30తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా 2025 మద్యం టెండర్ విధానాన్ని ప్రకటించింది. 2025 నుంచి 2027 వరకు రెండేళ్ల కాలపరిమితికి టెండర్ ఫీజు ఖరారు చేసింది. ఈ సారి మద్యం దుకాణం టెండర్ ఫాం ఫీజును రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ ఫీజు మాత్రమే పెంచిన ప్రభుత్వం.. మిగతా విధానాలు పాత పద్ధతుల్లోనే కొనసాగించేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాలో 10 మండలాల పరిధిలో 25 మద్యం దుకాణాలు ఉన్నాయి. ములుగు సర్కిల్ పరిధిలో 16, ఏటూరునాగారం సర్కిల్ పరిధిలో 9 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంలో జిల్లాలోని 25 షాపులకు గాను 874 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి దరఖాస్తుల ద్వారా రూ.17.48 కోట్ల ఆదాయం అదనంగా సమకూరింది.
రిజర్వేషన్ల ప్రకారం..
మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయనున్నారు. ఈసారి రిజర్వేషన్లు 30 శాతంగా నిర్ణయించారు. గౌడ కులస్తులకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్లు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల ఆధారంగా మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. అయితే ఆయా దుకాణాలకు జనాభా ప్రాతిపదికన రెండేళ్ల కాలానికిగాను నాలుగు నెలలకోసారి ఆరు స్లాబ్‌లలో లైసెన్స్‌దారులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో మొత్తం 25 మద్యం షాపులు
గతంలో 874 దరఖాస్తులు
స్లాబ్‌ల వారీగా ఫీజు చెల్లింపు