
శాంతించిన గోదావరి
సమ్మక్కసాగర్‌కు తగ్గుతున్న వరద
ఏటూరునాగారం: గోదావరి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి గురువారం ఉదయం నుంచి తగ్గుతుండడంతో జిల్లాలోని అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మండల పరిధిలోని రామన్నగూడెం వద్ద ఉదయం 9 గంటలకు 16.45 ఉండగా సాయంత్రం 6 గంటలకు 15.91 మీటర్లకు చేరింది. అయితే వరద తగ్గుతున్న క్రమంలో కరకట్ట కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా ఇరిగేషన్‌శాఖ అధికారులు మూడు వేల ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచారు. ఎక్కడ గండ్లు పడినా వెంటనే ఇసుక బస్తాలు వేసి కరకట్ట కోతకు గురికాకుండా చేసే ప్రయత్నం చేపట్టారు. ఓడవాడ, ఎస్సీ కాలనీ వైపు నుంచి వరద నీరు వెనుకకు వెళ్లడంతో భూములు తేలాయి. దీంతో గోదావరి సమీపంలోని ప్రజలు భయాందోళన నుంచి తేరుకున్నారు. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద ఉన్న గంగాదేవి ఆలయాన్ని గోదావరి తాకుతూ ప్రవహిస్తోంది.
పోటెత్తిన వరద
గోదావరి తగ్గుతూ రాంనగర్ వైపు పోటెత్తడంతో రాంనగర్–రామన్నగూడెం గ్రామాల మధ్యలోని రహదారి మునిగిపోయింది. దీంతో కోయగూడ ఎల్లాపురం, రాంనగర్, లంబాడీతండా గ్రామాల ప్రజలు గోదావరి నీటిలో నుంచి నడుచుకుంటూ తమతమ పనులకు వెళ్లారు. విద్యార్థులు వరద దాటలేక పాఠశాలలకు వెళ్లలేక ఇంటివద్దే ఉండిపోయారు. రాంనగర్ వద్ద వరదలో ఎవరూ దిగకుండా పోలీసులు పహారా కాశారు. పంచాయతీ సిబ్బంది సైతం రాంనగర్ వైపు అడ్డుగా ట్రాక్టర్‌ను ఏర్పాటు చేసి ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే కొండాయి, ఎలిశెట్టిపల్లి గ్రామాల ప్రజలు పడవల ద్వారానే రాకపోకలను సాగిస్తున్నారు.
ముంపు గ్రామాల్లో క్లోరినేషన్
మండలంలోని రామన్నగూడెం, రాంనగర్, ఓడవాడ, ఎస్సీ కాలనీ ప్రాంతాల్లో క్లోరినేషన్ పనులను పంచాయతీ అధికారులు, సిబ్బంది ముమ్మరం చేశారు. ప్రజలు రోగాల భారిన పండకుండా ముందస్తుగా ఫాగింగ్, బ్లీచింగ్ చల్లించే పనులు చేపట్టారు. ప్రజలు దోమ తెరలు వాడాలని ఇంటింటికీ ఆశ కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించారు.
రాంనగర్ గ్రామానికి పోటెత్తిన వరద
కరకట్ట కోతను అడ్డుకునేందుకు
3 వేల ఇసుక బస్తాలు సిద్ధం
రామన్నగూడెం వద్ద
నీటిమట్టం 15.91 మీటర్లు
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్ బ్యారేజీకి బుధవారం సాయంత్రం వరకు 11,12,170 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా గురువారం సాయంత్రం వరకు 8,26,610 క్యూసెక్కులకు తగ్గింది. గోదావరి తగ్గుముఖం పడుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 84.20 మీటర్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు అధికారులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం దేవాదుల ఎత్తిపోతల వద్ద 87.20 మీటర్ల నీటి మట్టం ఉన్నట్లు ఇంజనీరింగ్ అధికారులు తెలుపుతున్నారు.

శాంతించిన గోదావరి

శాంతించిన గోదావరి