
ఉపాధి జాతర
నేడు 171 గ్రామ పంచాయతీల్లో పనులు ప్రారంభం
వెంకటాపురం(ఎం): గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఏడాదిలో 100 రోజులు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలుచేస్తోంది. పంచాయతీల అభివృద్ధిలో ప్రజలను మరింత భాగస్వాములను చేసేందుకు పనుల జాతర–2025 పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రారంభించే పనులు..
ఎన్‌ఆర్‌ఈజీఎస్ పథకంలో భాగంగా కమ్యూనిటీ సముదాయాలు, పశువుల కొట్టాలు, కోళ్లు, మేకల షెడ్లు, వ్యవసాయ బావుల నిర్మాణాలు, చెక్‌డ్యాములు, తోటలు, ఉద్యానవనాలు, కంపోస్టు గుంతలు, అజోల్ల ఫిట్ల నిర్మాణం, పాఠశాల మరుగుదొడ్లు, భవనం పైకప్పు మరమ్మతులు, తాటి, ఈత చెట్లు నాటడం, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితర పనులను ప్రారంభించనున్నారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో..
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ షెడ్లు, సెగ్రిగేషన్ షెడ్లు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ, శానిటరీ కాంప్లెక్స్ తదితర వాటికి భూమిపూజ చేయనున్నారు.
ఈ మేరకు జిల్లాలోని 10 మండలాల పరిధిలో 171 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో శుక్రవారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రణాళికలు ఖరారు చేసి జిల్లాలో 816 పనులను గుర్తించారు. వీటిని పూర్తి చేసేందుకు రూ.33.42 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఒకేసారి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకున్నాం. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర ఆదేశానుసారం శుక్రవారం గ్రామాల్లో పనుల జాతర చేపడతాం. ఉపాధి కూలీలకు 100 రోజుల పని కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మొదలు కానున్నాయి. – శ్రీనివాస్‌రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి
●
816 పనులకు.. రూ.33.42 కోట్లు కేటాయింపు
పనుల జాతర 2025 పేరిట ప్రత్యేక కార్యక్రమం

ఉపాధి జాతర

ఉపాధి జాతర