తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విశ్వక్‌ సేన్‌ | Vishwak Sen Donated 10 Lakhs Telugu States | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించిన విశ్వక్‌ సేన్‌

Sep 3 2024 11:16 AM | Updated on Sep 3 2024 1:11 PM

Vishwak Sen Donated 10 Lakhs Telugu States

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి విపత్తుల సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్‌ హీరోలు ముందుకొచ్చారు. రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు చొప్పున జూ.ఎన్టీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యంగ్‌ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు తన వంతుగా సాయం ప్రకటించారు.

తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ ప్రజలను భారీ వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ప్రభుత్వాల నుంచి తమకు సరైన సాయం అందడంలేదంటూ ప్రజలు చేయి చాపుతున్నారు. పిల్లలకు పాలతో పాటు తమకు తాగేందుకు కనీసం నీళ్లు అయినా ఇవ్వండి అంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. 

ఇలాంటి విపత్తు సమయంలో  వరద సహాయక చర్యలకు మద్దతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు విశ్వక్ సేన్ ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన వారి బాధలను కొంతైనా తగ్గించే దిశగా ఈ చిన్న సహకారం అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. తన అభిమాన హీరో తారక్‌ రెండు రాష్ట్రాలకు కలిపి రూ.1 కోటి విరాళం ప్రకటించిన వెంటనే విశ్వక్‌ కూడా అదే దారిలో తన వంతుగా సాయం చేయడం విశేషం. దీంతో తారక్‌, విశ్వక్‌ ఫ్యాన్స్‌ అభినందిస్తూ సోషల్‌మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement