
‘ఆర్ నారాయణ మూర్తి మాదిరి రాజీ లేకుండా బతకడం నా వల్ల కాదు. నేను చాలా సార్లు రాజీపడ్డాను. అందుకే నారాయణ మూర్తిని చూస్తే నాకు కొంచెం ఈర్ష్య కూడా ఉంటుంది’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’. ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా ప్రసాద్ ల్యాబ్‌లో వేసిన స్పెషల్ షోని త్రివిక్రమ్ చూశారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సినిమా నిడివి (2 గంటలు) చూసి కాస్త భయపడ్డాను. కానీ సినిమా స్టార్ట్ అయ్యాక.. అసలు సమయమే తెలియలేదు. ప్రారంభం నుంచి చివరి వరకు వేగంగా సాగింది. ఈ సినిమాలో చూపించిన ఆంశాలు తక్షణమే ఉత్తేజపరచవు. అయినప్పటికీ సినిమా పట్టువిడవకుండా నడిపించారాయన. నిజాయతీతో పని చేశారు. దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అది ఆయన సొంతం. దాని కోసమే నేను వచ్చా.
ఓ సినిమాలోని పాత్రకు నారాయణ మూర్తిని అనుకున్నా. కానీ రెమ్యునరేషన్తో ఆయన్ని కొనలేం అని ఎవరో చెప్పారు. ఆయనలా బతకడం అందరికి సాధ్యం కాదు. నారాయణ మూర్తి వన్‌మ్యాన్ ఆర్మీ. ఆయన చిత్రాల్లో ఆయనే రాజు, ఆయనే సైన్యాధిపతి. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోజనం ఉండాలనుకుంటారు. అణచివేతకు గురైన వారి తరఫున మాట్లాడేందుకు ఒక గొంతుక ఉంది. అది అందరికీ వినపడాలి. అది మనకు నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు. కానీ, ఇలాంటి వారు మాట్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి నెలకొంటుంది’ అని త్రివిక్రమ్ అన్నారు.