breaking news
University Paper Leak Movie
-
నారాయణ మూర్తి అందమైన హీరో: బ్రహ్మానందం
‘‘యూనివర్సిటీ పేపర్ లీక్’ సినిమాలో కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం, అలాగే తండ్రి కోసం కొడుకు చేసిన త్యాగం... ఇలాంటి భావోద్వేగాలను ఒక చోటకు తీసుకొచ్చి, మానవ భావోద్వేగాలతో ఈ సమాజం ఎలా ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం చేశారు నారాయణ మూర్తి’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ ఈ నెల 22న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘మీ దృష్టిలో అందమైన హీరో ఎవరు?’ అని ఎవరైనా నన్ను అడిగితే నారాయణ మూర్తి పేరు చెబుతాను. అందం అంటే... గ్లామర్, 6 ఫీట్స్ హైట్, కర్లింగ్ హెయిర్... వంటి అందం కాదు. మదర్ థెరిస్సాని ‘మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా?’ అని అడిగితే.. ఎవరి మనస్సులో సేవాభావం, ఎవరి కళ్లల్లో దయా గుణం ఉంటాయో ఆ వ్యక్తి, ఆ జీవి అందంగా ఉంటుంది’ అని చెప్పారు.నలభై ఏళ్లుగా నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, పేదవాళ్ల పక్షాన ఉంటూ సినిమాలు తీస్తున్నారు. ఇవాళ మన దేశం, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేసి, ‘యూనివర్సిటీ’ తీశారు. డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం నిజాయతీగా తీసిన ‘యూనివర్సిటీ’ సినిమాని చూసి, ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు’’ అన్నారు. ‘‘బ్రహ్మానందంగారు మహానటుడు, మహా జ్ఞాని. అన్నింటినీ మించి మాస్టరు. అందుకే నా ‘యూనివర్సిటీ’ లోగోని ఆయనతో ఆవిష్కరింపజేశాను. మా చిత్రాన్ని చూడండి... ఏమాత్రం బాగున్నా ఆదరించి, మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి’’ అని కోరారు ఆర్. నారాయణ మూర్తి. -
మహేశ్‌బాబు అన్న మూవీలో సెకండ్ హీరోగా.. ఆ సినిమా వల్లే..
ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం యూనివర్సిటీ. పేపర్ లీక్ అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నారాయణ మూర్తి (R Narayana Murthy) ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది? ఏంటనే విషయాలను పంచుకున్నారు.రూ.70తో చెన్నై..ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాది కాకినాడలో మల్లంపేట అనే కుగ్రామం. టూరింగ్ టాకీస్‌కి వెళ్లి సినిమాలు చూసేవాడిని. సినిమా యాక్టర్ అయిపోవాలని రూ.70తో చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లాక నాలా లక్షలాది మంది ఉన్నారని చూశాను. జూనియర్ వేషాలు వేశాను. అప్పుడు మహానటులను చూశాను. నాకు బొమ్మలు వేసే అలవాటుండేది. నేను వేసిన ఏఎన్నార్ బొమ్మ చూసి డైరెక్టర్, నా గురువు దాసరి నారాయణరావుగారు మెచ్చుకున్నారు. పొంగిపోయాను. డిగ్రీ పూర్తి చూసి వస్తే వేషం ఇస్తానన్నారు. సెకండ్ హీరోగా..డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి దాసరిగారిని కలిశా.. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్‌బాబు అన్న రమేశ్‌బాబు నీడ సినిమాలో వేషం ఇచ్చారు. సెకండ్ హీరోగా చేశాను. తర్వాత సంధ్య సినిమాలో నన్నే హీరోగా పెట్టి మూవీ తీశారు. ఆ తర్వాత నాకు వేషాలొచ్చాయి. కానీ, నటుడిగా బిజీ కాలేకపోయాను. హీరో వేషాలు రాలేదు. చిన్న వేషాలే వస్తున్నాయి. చాలా స్ట్రగుల్ అయ్యా.. నేనెప్పుడు హీరో అవుతాను? నా ముఖం నావాళ్లందరికీ ఎలా చూపించుకోగలను? అని మానసిక వేదన చెందాను. ఆ పాటతోనే ధైర్యంఅన్ని రకాల బాధలు పడుతున్న సమయంలో ఘంటసాల పాడిన 'కల కానిది.. విలువైనిది..' పాట నాలో ధైర్యం నింపింది. నాకెవరూ హీరో వేషం ఇవ్వట్లేదు కాబట్టి నేనే హీరో అవ్వాలనుకున్నాను. హీరో కావాలంటే డబ్బులు కావాలి. అప్పుడు నా స్నేహితుల సహకారంతో స్నేహ చిత్ర పిక్చర్స్ పేరిట బ్యానర్ ప్రారంభించాను. నా బ్యానర్లో తీసిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వాతంత్ర్యం. సినిమా పిచ్చితో కథ, డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, యాక్షన్.. అన్నీ నేనే చేసుకున్నాను. జనం దగ్గర సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.చదవండి: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం -
ఆర్ నారాయణ మూర్తిలా బతకడం కష్టం : త్రివిక్రమ్
‘ఆర్ నారాయణ మూర్తి మాదిరి రాజీ లేకుండా బతకడం నా వల్ల కాదు. నేను చాలా సార్లు రాజీపడ్డాను. అందుకే నారాయణ మూర్తిని చూస్తే నాకు కొంచెం ఈర్ష్య కూడా ఉంటుంది’ అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆర్ నారాయణమూర్తి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ పేపర్ లీక్’. ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో తాజాగా ప్రసాద్ ల్యాబ్‌లో వేసిన స్పెషల్ షోని త్రివిక్రమ్ చూశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఈ సినిమా నిడివి (2 గంటలు) చూసి కాస్త భయపడ్డాను. కానీ సినిమా స్టార్ట్ అయ్యాక.. అసలు సమయమే తెలియలేదు. ప్రారంభం నుంచి చివరి వరకు వేగంగా సాగింది. ఈ సినిమాలో చూపించిన ఆంశాలు తక్షణమే ఉత్తేజపరచవు. అయినప్పటికీ సినిమా పట్టువిడవకుండా నడిపించారాయన. నిజాయతీతో పని చేశారు. దాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. అది ఆయన సొంతం. దాని కోసమే నేను వచ్చా. ఓ సినిమాలోని పాత్రకు నారాయణ మూర్తిని అనుకున్నా. కానీ రెమ్యునరేషన్‌తో ఆయన్ని కొనలేం అని ఎవరో చెప్పారు. ఆయనలా బతకడం అందరికి సాధ్యం కాదు. నారాయణ మూర్తి వన్‌మ్యాన్ ఆర్మీ. ఆయన చిత్రాల్లో ఆయనే రాజు, ఆయనే సైన్యాధిపతి. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రయోజనం ఉండాలనుకుంటారు. అణచివేతకు గురైన వారి తరఫున మాట్లాడేందుకు ఒక గొంతుక ఉంది. అది అందరికీ వినపడాలి. అది మనకు నచ్చొచ్చు.. నచ్చకపోవచ్చు. కానీ, ఇలాంటి వారు మాట్లాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రపంచంలో ఏక పక్ష ధోరణి నెలకొంటుంది’ అని త్రివిక్రమ్ అన్నారు.