
ఆర్ నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి, స్వీయదర్శకత్వం వహించిన చిత్రం యూనివర్సిటీ. పేపర్ లీక్ అనేది ట్యాగ్‌లైన్. ఈ మూవీ ఆగస్టు 22న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నారాయణ మూర్తి (R Narayana Murthy) ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తనకు సినిమాలపై ఆసక్తి ఎలా వచ్చింది? ఏంటనే విషయాలను పంచుకున్నారు.
రూ.70తో చెన్నై..
ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. మాది కాకినాడలో మల్లంపేట అనే కుగ్రామం. టూరింగ్ టాకీస్‌కి వెళ్లి సినిమాలు చూసేవాడిని. సినిమా యాక్టర్ అయిపోవాలని రూ.70తో చెన్నై వెళ్లాను. అక్కడికి వెళ్లాక నాలా లక్షలాది మంది ఉన్నారని చూశాను. జూనియర్ వేషాలు వేశాను. అప్పుడు మహానటులను చూశాను. నాకు బొమ్మలు వేసే అలవాటుండేది. నేను వేసిన ఏఎన్నార్ బొమ్మ చూసి డైరెక్టర్, నా గురువు దాసరి నారాయణరావుగారు మెచ్చుకున్నారు. పొంగిపోయాను. డిగ్రీ పూర్తి చూసి వస్తే వేషం ఇస్తానన్నారు.
సెకండ్ హీరోగా..
డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి దాసరిగారిని కలిశా.. ఇచ్చిన మాట ప్రకారం మహేశ్‌బాబు అన్న రమేశ్‌బాబు నీడ సినిమాలో వేషం ఇచ్చారు. సెకండ్ హీరోగా చేశాను. తర్వాత సంధ్య సినిమాలో నన్నే హీరోగా పెట్టి మూవీ తీశారు. ఆ తర్వాత నాకు వేషాలొచ్చాయి. కానీ, నటుడిగా బిజీ కాలేకపోయాను. హీరో వేషాలు రాలేదు. చిన్న వేషాలే వస్తున్నాయి. చాలా స్ట్రగుల్ అయ్యా.. నేనెప్పుడు హీరో అవుతాను? నా ముఖం నావాళ్లందరికీ ఎలా చూపించుకోగలను? అని మానసిక వేదన చెందాను.
ఆ పాటతోనే ధైర్యం
అన్ని రకాల బాధలు పడుతున్న సమయంలో ఘంటసాల పాడిన 'కల కానిది.. విలువైనిది..' పాట నాలో ధైర్యం నింపింది. నాకెవరూ హీరో వేషం ఇవ్వట్లేదు కాబట్టి నేనే హీరో అవ్వాలనుకున్నాను. హీరో కావాలంటే డబ్బులు కావాలి. అప్పుడు నా స్నేహితుల సహకారంతో స్నేహ చిత్ర పిక్చర్స్ పేరిట బ్యానర్ ప్రారంభించాను. నా బ్యానర్‌లో తీసిన తొలి చిత్రం అర్ధరాత్రి స్వాతంత్ర్యం. సినిమా పిచ్చితో కథ, డైరెక్షన్, స్క్రీన్‌ప్లే, యాక్షన్.. అన్నీ నేనే చేసుకున్నాను. జనం దగ్గర సక్సెస్ అయ్యాను అని చెప్పుకొచ్చారు.
చదవండి: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం