
‘‘యూనివర్సిటీ పేపర్ లీక్’ సినిమాలో కొడుకు కోసం తండ్రి చేసిన త్యాగం, అలాగే తండ్రి కోసం కొడుకు చేసిన త్యాగం... ఇలాంటి భావోద్వేగాలను ఒక చోటకు తీసుకొచ్చి, మానవ భావోద్వేగాలతో ఈ సమాజం ఎలా ఆడుకుంటుందో చెప్పే ప్రయత్నం చేశారు నారాయణ మూర్తి’’ అని ప్రముఖ నటుడు బ్రహ్మానందం అన్నారు. ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ ఈ నెల 22న విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘మీ దృష్టిలో అందమైన హీరో ఎవరు?’ అని ఎవరైనా నన్ను అడిగితే నారాయణ మూర్తి పేరు చెబుతాను. అందం అంటే... గ్లామర్, 6 ఫీట్స్ హైట్, కర్లింగ్ హెయిర్... వంటి అందం కాదు. మదర్ థెరిస్సాని ‘మీకు అందంగా కనిపిస్తున్న వ్యక్తి ఎవరమ్మా?’ అని అడిగితే.. ఎవరి మనస్సులో సేవాభావం, ఎవరి కళ్లల్లో దయా గుణం ఉంటాయో ఆ వ్యక్తి, ఆ జీవి అందంగా ఉంటుంది’ అని చెప్పారు.
నలభై ఏళ్లుగా నారాయణ మూర్తి నిరంతరం ప్రజలు, పేదవాళ్ల పక్షాన ఉంటూ సినిమాలు తీస్తున్నారు. ఇవాళ మన దేశం, మన విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అనే అంశాలపై అధ్యయనం చేసి, ‘యూనివర్సిటీ’ తీశారు. డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం నిజాయతీగా తీసిన ‘యూనివర్సిటీ’ సినిమాని చూసి, ఆదరిస్తే ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తాడు’’ అన్నారు. ‘‘బ్రహ్మానందంగారు మహానటుడు, మహా జ్ఞాని. అన్నింటినీ మించి మాస్టరు. అందుకే నా ‘యూనివర్సిటీ’ లోగోని ఆయనతో ఆవిష్కరింపజేశాను. మా చిత్రాన్ని చూడండి... ఏమాత్రం బాగున్నా ఆదరించి, మరిన్ని సినిమాలు తీసే శక్తిని ప్రసాదించండి’’ అని కోరారు ఆర్. నారాయణ మూర్తి.