
వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘అరి’. ‘పేపర్ బాయ్’ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. అరి షడ్వర్గాలను కాన్సెప్ట్‌గా తీసుకుని, ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్‌ని ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు శంకర్.
చివర్లో కృష్ణుడి ఎంట్రీ, అరి షడ్వర్గాల గురించి ఆయన ఇచ్చే సందేశం అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మకంగా చిత్రంగా అరిని మలిచారంటూ ఆడియెన్స్ దర్శకుడి మీద ప్రశంసల్ని కురిపించారు. ఇక మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా చివరి 20 నిమిషాల గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అరిపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. అలా డివైన్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ అరి చిత్రం ఆడియెన్స్ గుండెల్లోకి వెళ్లిపోయింది. అరి షడ్వర్గాలను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ - "అరి" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం. అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్ ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి కనిపించింది. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్ తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తాం’అన్నారు.