
‘నాకు చిన్నప్పటి నుంచి పురాణాలు, ఇతిహాసాలు అంటే ఆసక్తి. వాటి గురించి తెలుసుకుని, అవగాహన పెంచుకున్నాను. మన పురణాల్లో అరిషడ్వర్గాలను జయించాలి అని చెప్పారే తప్ప ఎక్కడా వాటిని ఎలా జయించాలో చెప్పలేదు. 2016లో ఈ స్టోరీ ఐడియా వచ్చింది. హిమాలయాలకు వెళ్లి కొందరు యోగులను కలిసి అరిషడ్వర్గాల గురించి సినిమా చేయాలనే ఆలోచనను తెలిపాను. వారు మంచి ప్రయత్నమని చెప్పి అనేక విషయాలు వెల్లడించారు. అరిషడ్వర్గాలను జయించేందుకు వారి ద్వారా మార్గాలు, సూచనలు తెలుసుకున్నాను. వాటి ఆధారంగానే ‘అరి’ చిత్రాన్ని రూపొందించాను’ అన్నారు దర్శకుడు జయ శంకర్. ‘పేపర్ బాయ్’లాంటి సూపర్ హిట్ తర్వాత ఆయన దర్శకత్వం వహించిన రెండో చిత్రం ‘అరి’. . వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ( ఆర్ వీ రెడ్డి ) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు జయశంకర్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ సినిమాల మీద ప్యాషన్ తో మంచి ఉద్యోగం వదులుకుని ఇండస్ట్రీకి వచ్చాను. 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టి నాలుగేళ్లకు 2018లో పేపర్ బాయ్ మూవీతో దర్శకుడిని అయ్యాను. తక్కువ టైమ్ లోనే దర్శకుడివి అయ్యావు అన్నారు. నా మొదటి సినిమా తర్వాత పెద్ద సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే కోవిడ్, ఇతర పరిస్థితుల వల్ల ఆ ప్రాజెక్ట్స్ మొటీరియలైజ్ కాలేదు. అప్పుడు బయటకు వచ్చి 2021లో అరి మూవీకి వర్క్ చేయడం ప్రారంభించాను.
→ ‘అరి’ లాంటి మూవీని స్టార్స్ కూడా చేయొచ్చు. అయితే పాత్రల కంటే వారి స్టార్ డమ్ రిఫ్లెక్ట్ అవుతుందని పాత్రలకు సరిపోయేలా సాయి కుమార్, అనసూయ, వైవా హర్ష ..ఇలాంటి వారిని తీసుకున్నాను. ఆరు ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటుల పర్ ఫార్మెన్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ పాత్రలన్నీ మీకు బాగా గుర్తుండిపోతాయి. ఇలాంటి కథల్ని పూర్తిగా సందేశాత్మకంగా కాకుండా ఎంటర్ టైనింగ్ గా చెప్పాలి. ఆ ప్రయత్నంలో సఫలమయ్యాననే అనుకుంటున్నా. వైవా హర్ష కామెడీ బాగా నవ్విస్తుంది.
→ నాకు ఉపేంద్ర గారి మూవీస్ బాగా ఇష్టం. ఆయన సినిమాలు కమర్షియల్ గా ఉంటూనే ఒక మెసేజ్ ఉంటుంది. ఉపేంద్ర మూవీ చూసినప్పుడు అలా ఒక సినిమా తెరకెక్కించాలనే ఆలోచన కలిగింది. ‘అరి’ కథ చెప్పినప్పుడు మా మూవీలో నటించిన ఆర్టిస్టులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఇలాంటి సబ్జెక్ట్ తో మూవీ రాలేదని అన్నారు.
→ మా ‘అరి’ మూవీలో వీఎఫ్ఎక్స్ ఆకర్షణగా నిలుస్తాయి. మాకున్న బడ్జెట్ లో క్వాలిటీ విజువల్ ఎఫెక్టులు చేశాం. అలాగే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించాం. సినిమాలో రెండు సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మనిషి కోరికలన్నీ ఒకదానితో మరొకటి ముడిపడే ఉంటాయి. మనం కోరుకున్నది దక్కినప్పుడు అహం ఏర్పడుతుంది, అదే పక్కవారికి దక్కితే అసూయ కలుగుతుంది.
→ అరిషడ్వర్గాలు అనే సబ్జెక్ట్ సాధారణ ప్రేక్షకులకు కూడా సులువుగా అర్థమయ్యే విధంగా ‘అరి’ సినిమాను రూపొందించాను. ఈ కారణం వల్లే చిత్రీకరణ ఆలస్యమైంది. వీలైనంత సింపుల్ గా ఈ సబ్జెక్ట్ ను తెరకెక్కించాం. సెన్సార్ వాళ్లు సినిమా చూసి అప్రిషియేట్ చేశారు. హార్ట్ టచింగ్ గా మూవీ రూపొందించారని ప్రశంసించారు. మా సినిమాకు మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నా. ఎందుకంటే మంచి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.
→ వెంకయ్య నాయుడు, మల్లాది, యండమూరి లాంటి వాళ్లు మా సినిమాను చూసి అభినందించారు. వెంకయ్య నాయుడు ‘అరి’ సినిమా చూసి మోడరన్ భగవద్గీతలా ఉంది అన్నారు. పురణాలు, ఇతిహాసాలు చదవని యువత ఈ సినిమా చూస్తే వాటిలోని సారం తెలుస్తుంది అన్నారు. ఆయన మాటల్ని గొప్ప ప్రశంసగా తీసుకున్నాం.
→ ఈ మూవీ యూత్ ఆడియెన్స్ కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ వరకు మా మూవీ ఏం జరుగుతుంది నెక్ట్స్ అనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. క్లైమాక్స్ 20 నిమిషాలు మాత్రం ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. తమకు కావాల్సినది దక్కించుకునేందుకు కొందరు వ్యక్తులు ఏం చేశారు అనేది ఈ చిత్ర నేపథ్యం. ఈ మూవీని హిందీలో ఒక పెద్ద హీరో, కన్నడలో ఒక స్టార్ చూశారు. వారికి బాగా నచ్చింది. అన్నీ కుదిరితే వారితో ఆయా భాషల్లో ‘అరి’ రీమేక్ చేస్తా.
→ మన దేశంలో పబ్బులకు వెళ్లేవాళ్లు ఎంతమంది ఉన్నారో, గుడికి వెళ్లేవారు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నారు. అలా స్పిరిచువల్ ఆలోచనలు ఉన్నవారు మా సినిమాను చూసినా చాలు అనుకుంటున్నాం.
→ త్వరలోనే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో ఓ సినిమా చేయబోతున్నా. డిసెంబర్ నుంచి ఆ మూవీ షూటింగ్ కు వెళ్తున్నాం.