
టైటిల్: అరి
నటీనటులు : వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి తదితరులు
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, డి, శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి
రచన –దర్శకత్వం : జయశంకర్
సంగీతం: అనుప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్, శివశంకర వరప్రసాద్
ఎడిటర్ : జి. అవినాష్
విడుదల తేది: అక్టోబర్ 10, 2025
'పేపర్ బాయ్' ఫేమ్ జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ఇంతవరకు తెరపై చూపించని కాన్సెప్ట్తో వస్తున్నామని దర్శకుడు పదే పదే చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని తెలియజేసింది. ఏదో కొత్త పాయింట్ చూపించబోతున్నారనే విషయం ట్రైలర్తోనే తెలిసిపోయింది. దీంతో అరిపై ఓ మోస్తరు అంచనాలు అయితే పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘అరి’ అందుకుందా? జయశంకర్ ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
'ఇక్కడ మీ కోరికలు తీర్చబడును' అని సోషల్ మీడియా, పేపర్, ఫోర్బ్స్ వంటి మ్యాగజైన్‌లలో యాడ్ ఇస్తాడు ఓ వ్యక్తి(వినోద్ వర్మ). అది చూసి ఆరుగురు వ్యక్తులు ఆయన దగ్గరకు వస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో కోరిక.
హోటల్లో టీ మాస్టర్గా పని చేసే అమూల్ కుమార్(వైవా హర్ష)కు సన్నీ లియోన్ అంటే మోజు. ఆమెతో ఒక్క రాత్రి అయినా గడపాలని అతని కోరిక.
60 ఏళ్లకు పైబడిన గుంజన్కు ఆస్తి పిచ్చి. ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆస్తి అంతా తనకే దక్కాలనే ఆశ
సీఐ చైతన్య (శ్రీకాంత్ అయ్యంగార్) నిధి అన్వేషణలో ఉంటాడు. ఆ నిధి ఎక్కడ ఉందో తెలుసుకొని..మొత్తం తీసుకెళ్లాలనేది అతని కోరిక
ఎయిర్ హోస్టర్ ఆత్రేయి(అనసూయ) తన సహోద్యోగి అవ్య అంటే అసూయ. తన కంటే అందంగా మారాలని.. ఆ అందం ఎప్పటికీ ఉండాలనేది ఆమె కోరిక
మరణించిన తన భర్తను తిరిగి బ్రతికించుకోవాలనేది లక్ష్మీ(సురభి ప్రభావతి) ఆశ
తన వారసులు ఎప్పటికీ ధనవంతులుగానే ఉండాలనేది వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్(సాయి కుమార్) కోరిక
ఈ ఆరుగురు విడివిడిగా వచ్చి యాడ్ ఇచ్చిన వ్యక్తిని కలుస్తారు. లైబ్రరీలో ఉండే సదరు వ్యక్తి వీరందరికి ఒక్కో టాస్క్ ఇస్తాడు. అది పూర్తి చేస్తేనే మీ కోరికలు తీర్చుతా అని హామీ ఇస్తాడు. ఆయన ఇచ్చిన టాస్కులు ఎంటి? వాటిని ఈ ఆరుగురు పూర్తి చేశారా లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు..ప్రస్తుతం వీటి చుట్టూనే మనిషి జీవితం తిరుగుతుంది. ఈ ఆరు బలహీనతలతో ఏదో ఒకటి ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అవి ఎలా ఉంటాయి? వాటిని తీర్చుకోవడం కోసం మనిషి ఎంతకు తెగిస్తాడు? అనేది ఈజీగా అర్థమయ్యేలా చూపించిన చిత్రం ‘అరి’.
అరిషడ్వార్గాల గురించి పురాణాల్లో వింటాం. అయితే మనిషిలో అవి ఎలా ఉంటాయని అనేది ఆరు పాత్రల్లో ఆసక్తికరంగా చూపించడమే కాకుండా ‘మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా జీవించాలి’ అనే సందేశాన్ని అందించాడు. డైరెక్టర్ రాసుకున్న కథకు వంక పెట్టడానికి ఏమి లేదు. డిఫరెంట్ స్టోరీనే..ఇంకా చెప్పాలంటే ఆయన అన్నట్లుగా ఇంతవరకు తెరపై చూపించని కాన్సెప్టే. కానీ ఎగ్జిక్యూషన్ పరంగా కాస్త తడబడ్డారు.
శ్రీనివాస రెడ్డి, 'చమ్మక్' చంద్ర పాత్రలతో కామెడీగా కథను ప్రారంభించిన దర్శకుడు.. కీలకమైన ఆరు క్యారెక్టర్లను ఆసక్తికరంగా పరిచయం చేసి వెంటనే అసలు కథలోకి తీసుకెళ్లాడు. ఒక్కో పాత్ర నేపథ్యాన్ని వివరిస్తూ.. కథనంపై ఆసక్తిని పెంచేశాడు. పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు.
ఒక్కొక్కరి కోరికతో పాటు వారు పూర్తి చేయాల్సిన టాస్క్ తెలిసిన తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. వారు ఈ టాస్కులను పూర్తి చేస్తారా? అసలు వారికి అలాంటి టాస్కులు ఎందుకు ఇస్తున్నాడు? అనే క్యూరియాసిటి ప్రేక్షకుల్లో కలుగుతుంది. అయితే సీరియస్‌గా సాగుతున్న కథకి మధ్యలో వచ్చిన పాట, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రల కామెడీ అడ్డంకిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది.
సెకండాఫ్ కథనం ఎమోషనల్‌గా సాగుతుంది. ఆరు పాత్రల్లో వచ్చే భావోద్వేగ మార్పు అందరికి అలోచింపజేస్తుంది. చివరి 30 నిమిషాలు ఈ సినిమాకు కీలకం. ఆరు పాత్రలకు ఉన్న సంబంధాన్ని ముడిపెడుతూ వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్‌లో మైథలాజికల్ టచ్ ఇవ్వడం సినిమాకు హైలెట్. దర్శకుడు తాను చెప్పదలుచుకున్న సందేశాన్ని క్లైమాక్స్‌లో గొప్పగా ఆవిష్కరించారు.
ఎవరెలా చేశారంటే..
అరిషడ్వర్గాలకి ప్రతీకగా ఈ చిత్రంలో ఆరు పాత్రలు ఉంటాయి. వ్యాపారవేత్త విప్రనారాయణ పాశ్వాన్ పాత్రకి సాయి కుమార్ న్యాయం చేశాడు. ఎయిర్ హోస్ట్ ఆత్రేయిగా అనసూయ ఉన్నంతలో చక్కగా నటించింది. కోపం ఎక్కువగా చూపించే సీఐ చైతన్య పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ ఒదిగిపోయాడు. అమూల్ కుమార్‌గా హర్ష కామెడీ సినిమాకు ప్లస్ అయింది .వినోద్ వర్మ పోషించిన పాత్ర ఈ సినిమాకు చాలా కీలకం. చివరిలో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. లక్ష్మిగా సురభి ప్రభావతి, దొంగ పాత్రలో సూర్య, గుంజన్ పాత్రలో శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది.
అనూప్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. పాటలు బాగున్నాయి. ముఖ్యంగా శ్రీకృష్ణుడి నేపథ్యంలో వచ్చే పాట తెరపై మరింత ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.