
ఆర్. నారాయణ మూర్తి లీడ్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్ లీక్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్‌లతో పాటు దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందినీ సిద్ధారెడ్డి, ప్రోఫెసర్ ఖాసీం, పలువురు విద్యార్థి సంఘాల నాయకులుపాల్గొని, ‘‘యూనివర్సిటీ’ సినిమా కేవలం విద్యార్థులే కాదు... ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ చూడదగిన మంచి చిత్రం’’ అని కొనియాడారు.
ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్ లీక్స్, గ్రూపు 1, 2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీక్స్ చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? వాళ్లకుపాఠాలు బోధించిన గురువులు ఏం కావాలి? అని మా సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నాం. కాపీయింగ్ అనేది చాలా ప్రమాదకరమైనది.
చూసి రాసినవాళ్లు డాక్టర్లు అయితే రోగులు బతుకుతారా? అలాంటివాళ్లు ఇంజినీర్ అయితే బ్రిడ్జిలు నిలబడతాయా? అందుకే విద్యను ప్రైవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి, విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చాటి చెప్పేదే మా చిత్రం. ఈ సినిమాలో 5పాటలు ఉన్నాయి. స్వర్గీయ గద్దర్‌గారితోపాటు జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేశ్ గొప్పగా రాశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాణం: ఆర్. నారాయణ మూర్తి.