
సాధారణంగా సినిమా జయాపజయాలను కలెక్షన్లతో ముడిపెడతారు. అలాగే ప్రతీ ఏటా కలెక్షన్లను అనుసరించి ఆ సంవత్సరపు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ సినిమా ఫలితాలను స్టార్ల స్టార్ డమ్‌ను విశ్లేషించడం కూడా రివాజు. అయితే ఈ సంప్రదాయానికి విరుద్ధంగా.. నటీనటుల అభినయం పరంగా ఈ విశ్లేషణ మొదలైనట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ మీడియా దీనికి శ్రీకారం చుట్టింది. తాజాగా ఈ ఏడాది అర్ధభాగంలో విడుదలైన సినిమాలను తీసుకుని వాటిలో అభినయం ద్వారా ప్రభావం చూపిన స్టార్స్‌ను గుర్తిస్తోంది. అందులో భాగంగా 8మంది తారల్ని ప్రకటించింది. అర్ధభాగంలో అభినయంతో ఆకట్టుకున్న ఆ నటీనటులు ఎవరంటే...

అభిషేక్ బెనర్జీ
స్టోలెన్ సినిమాలో నటించిన అభిషేక్ బెనర్జీ ఆ సినిమాని అమాంతం ప్రేక్షకుల హృదయాల్లో కూర్చోబెట్టారు. ఈ చిత్రంలో ప్రతీ భావాన్ని నిజంగా అన్నట్టు ప్రతిబింబించాడాయన. అతని నటన ఆ చిత్ర ప్రేక్షకులు పొందిన అనుభూతిని ఆకాశానికి తాకించింది. తరచూ నిశ్శబ్ధాన్ని ఆశ్రయిస్తూ ప్రేక్షకుల మనసుల్లో నిశ్శబ్ధంగా నిలిచిపోయింది.

సన్యా మల్హోత్రా
మిస్ట్రెస్ సినిమాలో నటించిన సన్యా మల్హోత్రా కూడా ఈ జాబితాలో స్థానాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది. ఒక మహిళగా ఈక్వాలిటీ కోసం పోరాడటం, ఊహించని ఒత్తిడి ఎదుర్కోవడం – ఆమె వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడం, ఇలాంటి పాత్ర పోషించడం సులభం కాదు. కానీ ఆమె ఆ పాత్రకు జీవం పోసింది.

ఆదర్శ్ గౌరవ్
సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ సినిమాలో ఆదర్శ్ గౌరవ్ పాత్రను మరచిపోవడం అంత సులభం కాదు. అందుకే అంత సులభంగా అతను ఫేమస్ అయ్యాడు. చిన్న పట్టణపు యువత కలలను ప్రతిబింబించడంతో పాటు హాస్య–భావాలను మనసుతో పలికించడం ద్వారా అతను అందరికీ గుర్తుండి పోయాడు.

వామికా గబ్బీ
బూల్ చుక్ మాఫ్ చిత్రంలో నటించిన వామికా గబ్బీ ప్రేమచుట్టూ అల్లుకునే అనేక సమస్యలను వాటిని ఎదుర్కున్న తీరును ఆమె పాత్ర కొత్తగా పరిచయం చేస్తుంది. తెరపై అద్భుతమైన భావాలను చూపెట్టిన వామికా గబ్బీ..ఈ ఏడాది గట్టి ప్రభావం చూపిన నటీమణుల్లో ఒకరుగా నిలిచింది.

రణదీప్ హుడా
మంచి విజయాన్ని సాధించిన జాట్ సినిమాలో రణదీప్ హుడా వీరానురాగాన్ని చూపిస్తూ విలనిజాన్ని ప్రదర్శించాడు. అతని పాత్ర అంత భయంకరంగా కనిపించకపోతే ఆ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకునేది కాదేమో..రణదీప్ నటన జాట్‌ను ఒక సినిమాగా మాత్రమే కాదు ఒక అనుభవంగా మార్చింది.

కాజోల్
ఇప్పటికే అనేక పాత్రల ద్వారా తనను తాను నిరూపించుకున్న సీనియర్ నటి కాజోల్... మా సినిమాలో మరింతగా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. మాతృత్వ బాధ్యతల్లో మునిగి పోయిన ఒక సగటు తల్లిగా కాజోల్, పటిష్టంగా పలికించిన భావోద్వేగాల లోతు అంతరంగాల్ని తాకుతుంది.

విక్కీ కౌశల్
చావా సినిమా సృష్టించిన సంచలనాల గురించి చెప్పుకోవడం ఎంత ముఖ్యమో ఆ సినిమాలో నటించిన విక్కీ కౌశల్ గురించి మాట్లాడడం అంతకన్నా ముఖ్యం. మరాఠా వీరుడు శంభూజీ మహరాజ్ ను ప్రేక్షకుల కళ్ల ముందు అతను ప్రతిష్టించిన తీరు అమోఘం. దేశంలో అత్యధిక శాతం మందికి అంతగా పరిచయం లేని ఓ వీరుని కధను పరిచయం చేయడం మాత్రమే కాదు వారి గుండెల్లో నిలిచిపోయేలా చేయడంలో విక్కీ...విజయం సాధించాడు.

అమీర్‌ఖాన్...
భావోద్వేగ భరిత సినిమాల ద్వారా భారీ విజయాల్ని అందుకోవడంలో తానెందుకు మిగిలిన హీరోల కన్నా ముందుంటాడో చాటి చెప్పడంలో అమీర్‌ఖాన్ మరోసారి విజయం సాధించాడు. సితారే జమీన్ పర్ లో అమీర్ ఖాన్ తన స్టార్ డమ్ ద్వారా కళ్ల ముందు మెరుపులు మెరిపించడం కన్నా... మన హృదయాలను స్పర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ పనిలో ఆయన విజయం సాధించాడు.