దసరా వచ్చిందంటే చాలు.. పెద్ద సినిమాలు క్యూ కడతాయి. ముఖ్యంగా టాలీవుడ్‍లో సంక్రాంతి సినిమాల తర్వాత అంతటి క్రేజ్ ఉన్న పండుగ ఇదే. ఈ పండుగకు సరిగ్గా నెలకు పైగా సమయం మాత్రమే ఉంది. పండుగ సీజన్ దగ్గరపడుతున్న కొద్దీ టాలీవుడ్‌లో ఈసారి దసరా సెలవులకు పెద్ద సినిమాల హడావుడి లేనట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ అగ్ర హీరోలు తప్పుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేశ్ లాంటి అగ్రతారలు ఈ విజయదశమి పోటీ నుంచి తప్పుకున్నారు. కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే ఈ పండుగ బరిలో నిలవనున్నట్లు కనిపిస్తోంది. ఆయన హీరోగా వస్తోన్న రణబాలి డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. అక్టోబర్ 16న ఈ సినిమా రిలీజ్ కానుందని అఫీషియల్‌గా ప్రకటించారు.
విశ్వంభరపై వీడని సస్పెన్స్..
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ దసరాకైనా రిలీజ్ అయితే బాగుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో విశ్వంభర విజయదశమికి వస్తుందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. మరికొద్ది రోజులు ఆగితే కానీ ఈ విషయంలో స్పష్టత వచ్చేలా లేదు. రాబోయే రోజుల్లోనైనా విశ్వంభరపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే. అయితే ఈ విజువల్ వండర్‌ను ఎలాగైనా దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇటీవలే ఓటీటీ హక్కుల వ్యవహారం కూడా ఒక కొలిక్కి వచ్చింది.
దసరా బరిలో బాలయ్య నిలుస్తాడా?
టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలయ్య సైతం దసరా బరిలో నిలుస్తాడని టాక్ వినిపిస్తోంది. బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చేనెల దసరా బరిలో నిలుస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఈ సినిమాను దసరాకే రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. రాబోయే షూటింగ్ షెడ్యూల్స్ పూర్తయ్యాక రిలీజ్ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది.
ముందుగానే ఆదర్శ కుటుంబం..
దసరా కంటే ముందుగానే వెంకీమామ- త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న ఆదర్శ కుటుంబం రిలీజ్ కానుంది. ఈ మూవీ వచ్చేనెల 2న గాంధీ జయంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ఇప్పటికే అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. దీంతో దసరా బరి నుంచి వెంకీమామ తప్పుకున్నట్లే.
బాక్సాఫీస్ వద్ద కనిపించని సందడి..
ఈ ఏడాది దసరా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించడం లేదు. విజయ్ దేవరకొండ రణబాలి మాత్రమే బాక్సాఫీస్ వద్ద బరిలో నిలవనుంది. తెలుగు అగ్రహీరోల సినిమాలు ఈ విజయదశమికి లేకపోవడం సినీ ప్రియులను నిరాశకు గురి చేస్తోంది. దీంతో రణబాలి మాత్రమే దసరా బాక్సాఫీస్‌ను శాసించేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా ఆయన సతీమణి రష్మిక మందన్నా నటించింది. వీరిద్దరి పెళ్లి తర్వాత వస్తోన్న తొలి సినిమా రణబాలి కావడం విశేషం.


