ఆకర్ష ఆలపాటి సమర్పణలో ధామా టేల్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘మెస్సి – లవ్ ఫ్రమ్ ఇండియా’. నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించారు. జమునా అబ్దు రెహ్మాన్, విజయన్, సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్‌ను స్కూల్ పిల్లల చేతుల మీదుగా ఘనంగా లాంచ్ చేశారు. చిన్నారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించినట్లు చిత్రబృందం తెలిపింది. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జేక్స్ బిజాయ్ సంగీతం సమకూరుస్తున్నారు. నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్, అశోక్ మల్లికార్జున్ వీఎఫ్ఎక్స్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. మరిన్ని వినూత్న ప్రాజెక్టులతో ముందుకు రానున్నామని చెప్పారు. నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ‘మెస్సి’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని, అర్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రానికి ప్రేక్షకులు, మీడియా మద్దతు అందించాలని కోరారు.


