
సాక్షి, హైదరాబాద్: వేతనాలు పెంచాలంటూ సినీకార్మికులు కొద్దిరోజులుగా సమ్మె (Tollywood Film Worker Strikes) చేస్తున్నారు. జీతాలను 30% మేర పెంచేవరకు షూటింగ్స్‌లో పాల్గొనేదే లేదని ఘంటాపథంగా చెప్తున్నారు. పద్నాలుగు రోజులుగా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. 2 వేల లోపు జీతాలున్నవారికి 25% జీతాలు పెంచుతామని నిర్మాతలు ముందుకొచ్చారు. కానీ కొన్ని కండీషన్లున్నాయంటూ మెలిక పెట్టారు. దీనికి కార్మికులు ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
అటు నిర్మాతలతో, ఇటు యూనియన్స్‌తో భేటీ
ఈ క్రమంలో ఆదివారం నాడు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని కొందరు నిర్మాతలు చిరంజీవి (Chiranjeevi Konidela)ని కలిసి మాట్లాడారు. ఈ భేటీ అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. సమస్య పరిష్కారానికి తనవంతుగా కార్మికులతో మాట్లాడతానని చిరంజీవిగారు చెప్పారు. ఓ పెద్దమనిషిగా ఇరు వర్గాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉన్నారు అని తెలిపారు. సోమవారం (ఆగస్టు 18న) ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో చిరంజీవి సమావేశమయ్యారు.
త్వరలోనే పరిష్కారం
ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని, ఫెడరేషన్ కార్యదర్శి అమ్మిరాజు తదితర యూనియన్ నాయకులు చిరంజీవిని కలిసి తమ సమస్యలను వివరించారు. భేటీ అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. 24 క్రాఫ్ట్స్ నుంచి 72 మందితో చిరంజీవి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మాపై నిందలు వేస్తున్నారు. మాకు కుదరని నిబంధనలు పెడుతున్నారు. మేము బాగుండాలి, అలాగే నిర్మాతలూ బాగుండాలి.
చిరంజీవికి అన్నీ చెప్పాం
నిర్మాతలు పెట్టిన 2 కండీషన్స్‌కు ఒప్పుకుంటే మేమేం నష్టపోతామో చిరంజీవిగారికి వివరించాం. ఆదివారం నాడు డబుల్ కాల్ షీట్ గురించి కూడా చెప్పాం. మాకు ఏ సమస్య ఉన్నా తన దగ్గరకు రమ్మని చిరంజీవి గారు చెప్పారు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నాం. ఛాంబర్‌తో కూడా సమావేశం కానున్నాం. చర్చలకు పిలిచారు కాబట్టి మేము నిరసన కార్యక్రమం ఆపేశాం. మేం అడిగినట్లుగా మాకు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం అన్నారు.
నిర్మాతల మీటింగ్
మరోపక్క నిర్మాతలు ఫిలిం ఛాంబర్‌లో సమావేశమై కార్మికుల వేతనాల పెంపు డిమాండ్లపై చర్చించారు. అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. నిర్మాతలందరూ సమస్య పరిష్కార బాధ్యతను ఛాంబర్‌కే అప్పగించారు. ఛాంబర్ త్వరలో తుది నిర్ణయం తీసుకుంటుంది. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అని పేర్కొన్నారు.