ప్రముఖ నటుడు, పోకిరి విలన్ ఆశిష్ విద్యార్థి పెద్ద గండం నుంచి బయటపడ్డాడు. భార్య రూపాలి బరువాతో కలిసి శుక్రవారం రాత్రి గువహటిలో బయట డిన్నర్ చేశాడు ఆశిష్. డిన్నర్ తర్వాత రోడ్డు దాటే క్రమంలో స్పీడుగా వస్తున్న ఓ బైక్ వీరిని ఢీ కొట్టింది. అది గమనించిన స్థానికులు వెంటనే బైకర్‌తో పాటు ఆశిష్ దంపతులను ఆస్పత్రిలో చేర్పించారు.
యాక్సిడెంట్
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆశిష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చాడు. నిన్న రోడ్డు దాటుతుండగా యాక్సిడెంట్ అయింది. ప్రస్తుతానికి ఇద్దరం క్షేమంగానే ఉన్నాం. రూపాలిని ఇంకా అబ్జర్వేషన్‌లో ఉంచారు. నాకు చిన్న గాయం అయింది, కానీ లేచి నడవగలను, మాట్లాడగలను. మీ ఆశీస్సుల వల్ల అంతా బానే ఉంది. భయపడాల్సిందేమీ లేదు అని చెప్పుకొచ్చాడు.
సినిమా
ఆశిష్ విద్యార్థి.. గుడుంబా శంకర్, అన్నవరం, నరసింహుడు, అతిథి, తులసి, చిరుత, కంత్రి, అదుర్స్, నాయక్, ఆగడు, కిక్ 2, నాన్నకు ప్రేమతో, ఇస్మార్ట్ శంకర్.. ఇలా అనేక సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, బెంగాలీ, మలయాళ, మరాఠి భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. చివరగా 'ద ట్రేటర్స్' అనే రియాలిటీ షోలో కనిపించాడు. ఆశిష్ గతంలో రాజోషిని పెళ్లి చేసుకోగా వీరికి కుమారుడు అర్థ్ సంతానం. పలు కారణాల రీత్యా 2022లో దంపతులు విడిపోయారు. ఆ మరుసటి ఏడాది ఆశిష్.. రూపాలి బరువాను రెండో పెళ్లి చేసుకున్నాడు.


