తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి విజయ్..తనదైన స్టైల్లో ప్రసంగిస్తూ ప్రతిపక్ష డీఎంకేకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ తన ప్రభుత్వంలో వాటికి అడ్డుకట్ట వేస్తుందని విజయ్ ప్రకటించారు. నీట్, హిందీ భాష వివాదంతో పాటు కరూర్ తొక్కిసలాట ఘటన గురించి కూడా విజయ్ ఆవేశంగా మాట్లాడాడు. అయితే ఇదంతా ఒకెత్తు అయితే..ఆయన అసెంబ్లీలో చేసిన సైగలు మరో ఎత్తు. ఆ సైగలు చూసి డీఎంకే నేతలు రగిలిపోతుండగా.. నెటిజన్స్ మాత్రం తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తూ..నవ్వులు పూయిస్తున్నారు.
స్పీకర్ అనుమతితో..
అసెంబ్లీలో ఎంతో ఆవేశంగా మాట్లాడిన విజయ్.. తన ప్రసంగం ముగించే ముందు స్పీకర్‌కు ఓ విజ్ఞప్తి చేశాడు. తాను సినిమా స్టైల్ లో ఓ సంజ్ఞ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన అనుమతి ఇవ్వగానే అల్లు అర్జున్ స్టైల్లో గడ్డం కింద చేయి పెట్టి అంతా అయిపోయిందన్న తరహాలో ఓ సైగ చేశారు. దీంతో టీవీకేతో పాటు కూటమి ఎమ్మెల్యేలు హర్షధ్వానాలు చేశారు. డీఎంకే సభ్యులు మాత్రం రగిలిపోతూ వాకౌట్ చేశారు.
స్టాలిన్‌కి కౌంటర్‌గా..
గతంలో స్టాలిన్ కూడా ఇదే తరహా సైగలు చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చల అనంతరం డీఎంకే కార్యాలయం నుంచి తిరిగెళ్లే సందర్భంలో స్టాలిన్.. మ్యాటర్ సెటిలైందనే అర్థం వచ్చేలా చేతితో ఇలానే సైగ చేశారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. స్టాలిన్‌కి కౌంటర్‌గానే విజయ్ ఇలా సైగలు చేసినట్లు వీడియో చూస్తే అర్థమవుతుంది.

నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్..
విజయ్ చేసిన సైగలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొంతమంది నెటిజన్స్ విజయ్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘విజయ్ అన్న సినిమాల షూటింగ్‌ని మిస్ అవుతున్నాడేమో’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. మరో నెటిజన్ ఏమో.. ‘త్వరలోనే తమిళనాడు అసెంబ్లీకి ఓటీటీ రైట్స్ పెడతారోమో అని వ్యాఖ్యానించాడు. మరొకరు.. ‘స్పీకర్ కట్ అన్న ప్రతిసారి.. సీఎం విజయ్ సినిమా కట్ అనుకుంటున్నాడేమో’ అని కామెంట్ చేశాడు. చాలా మంది విజయ్ హాస్య చతుర బాగుందని పోస్టులు పెడుతున్నారు.
#WATCH | Chennai: Tamil Nadu Chief Minister C Joseph Vijay seeks permission from the Speaker and performs a cinematic gesture as he concludes his speech in the State Assembly.
(Video source: Tamil Nadu State Assembly) pic.twitter.com/Y7BlOXHkYI— ANI (@ANI) June 23, 2026


