బాలీవుడ్ నటి ఊర్మిళ మటోండ్కర్ మాజీ భర్త మోహ్సిన్ అక్తర్ మీర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ ఏడాది జూన్‌లో నిధా భట్‌ను వివాహం చేసుకున్న ఆయన.. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా తన భార్యపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ నోట్ రాశారు. అది ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
‘నువ్వు కేవలం నా భార్యగా మాత్రమే కాదు.. నా ఇల్లు, ప్రశాంతత, ప్రతిరోజూ నాకు ఇష్టమైన వ్యక్తిగా మారావు. నిన్ను నా జీవితంలోకి తీసుకొచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు. ప్రతి దశలో నిన్ను ప్రేమిస్తూ, నీకు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మనం కలిసి నిర్మించబోయే అందమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు.
ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అందమైన జంట.. మీ ఇద్దరూ ప్రేమతో, ఆనందంగా ఉండాలి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మోహ్సిన్‌ను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఊర్మిళతో ఉన్న సమయంలోనూ ఇలాంటి హామీలే ఇచ్చి ఉంటారని కామెంట్లు చేస్తున్నారు. అసలు ఊర్మిళ, మోహ్సిన్ మధ్య ఏం జరిగిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.
గతంలోనూ వైరల్..
మోహ్సిన్ తన రెండో పెళ్లి సమయంలోనూ సోషల్‌మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ‘స్వచ్ఛమైన ఉద్దేశాలు, నిజమైన ప్రేమతో పాటు దేవుడి నిర్ణయాన్ని విశ్వసించాలి. సరైన సమయంలో నిధాను నా జీవితంలోకి తీసుకొచ్చారు. ఆమె నా జీవితంలో వెలుగులు నింపింది’ అని రాసుకొచ్చారు.
2016లో ఊర్మిళతో వివాహం..
ఊర్మిళ మటోండ్కర్, మోహ్సిన్ అక్తర్ మీర్ 2016 ఫిబ్రవరి 4న అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావడంతో పాటు.. ఇద్దరి మధ్య దాదాపు పదేళ్ల వయసు తేడా ఉండటంతో అప్పట్లో వార్తల్లో నిలిచారు. 2014లో ఓ వివాహ వేడుకలో ఊర్మిళను కలిసిన మోహ్సిన్.. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డారని సమాచారం. రెండేళ్ల తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.


