
‘‘నేను ఏ సినిమా చేసినా అందులో ఒక కొత్త కాన్సెప్ట్ ఉండేలా చూసుకుంటాను. ‘థామా’ సినిమా కాన్సెప్ట్ ఆడియన్స్‌ని అలరిస్తుంది. ఈ సినిమాలోని అలోక్ క్యారెక్టర్ చేయడం కొత్తగా అనిపించింది. ‘థామా’ చిత్రం కోసం యాక్షన్ సీక్వెన్స్ చాలా చేశాను’’ అని ఆయుష్మాన్ ఖురానా అన్నారు. ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్నా హీరో హీరోయిన్లుగా నటించిన హిందీ చిత్రం ‘థామా’. మాడాక్ హారర్ ఫిల్మ్స్ యూనివర్స్ (ఎమ్‌హెచ్‌సీయు) లో భాగంగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 21న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘థామా’ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ– ‘‘నా సినిమా ప్రమోషన్స్ కోసం తొలిసారిగా హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ‘థామా’ ఫుల్ పాన్ ఇండియా మూవీ. రష్మికగారితో తొలిసారి కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆమె బ్రిలియంట్ పెర్ఫార్మర్. ‘థామా’ సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు. ‘‘మాడాక్ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది.
‘థామా’ సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాలో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేసే క్యారెక్టర్ చేశాను’’ అని తెలిపారు రష్మికా మందన్నా. ‘పోలీసుల కోసం నేను ఏమైనా చేస్తాను’, ‘ఏం చేశారో చెప్పండి’, ‘విక్రమార్కుడు సినిమా ఎనిమిది సార్లు చూశాను సార్’, ‘నేను వెళ్లక తప్పదు అలోక్... నా కారణంగా నువ్వు కూడా ప్రమాదంలో పడతావ్..’, ‘నాకేం కలిసి చనిపోయే ఉద్దేశం లేదు... మనం కలిసి బతుకుదామా!’, ‘నేను నీతో పాటు ఉండలేను... మన ప్రపంచాలు ఒకటి కావు’ అనే డైలాగ్స్ ‘థామా’ తెలుగు ట్రైలర్‌లో ఉన్నాయి.