తనకు వచ్చిన కలలు ఒక్కోసారి నిజం అవుతాయని అంటున్నారు ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma Kanakala). తాజాగా ఆమె ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొని..తన కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనకు వచ్చిన కలలు చాలా వరకు నిజమవుతాయని, ఓ సారి రాజీవ్‌కి యాక్సిడెంట్ అయినట్లు కల వస్తే.. నిజంగానే అది జరిగిందని చెప్పుకొచ్చింది. ‘కొన్ని సార్లు నాకు వచ్చిన కల నిజమవుతుంటాయి.
ఓ సారి రాజీవ్‌కి షూటింగ్‌లో కాలు విరిగినట్లు కల వచ్చింది. అప్పట్లో ఫోన్లు లేవు..ల్యాండ్‌లైన్‌లోనే మాట్లాడాలి. ఒక రోజంతా ఫోన్ చేసినా.. ఆయన కాంటాక్ట్‌లోకి రాలేదు. మరుసటి రోజు ఉదయం ఫోన్ చేసి ‘నువ్వు బాగానే ఉన్నావా?’అని అడిగా. ‘ఎందుకు అలా అడుగుతున్నావ్? అని ఆయన అన్నారు. అప్పుడు నాకు వచ్చిన కల గురించి చెబితే..నిజంగా ఆ రోజు యాక్సిడెంట్ జరిగి..కాలు విరిగిందని చెప్పాడు.
షూటింగ్‌లో భాగంగా కారు డ్రైవ్ చేస్తుంటే..చెట్టుని ఢీకొట్టింది’ అని చెప్పాడు. అలాగే ఓసారి గుడికి వెళ్లినట్లు కల వచ్చింది.. అనుకోకుండా మరుసటి రోజు మేం అదే గుడికి వెళ్లాం. కొన్నేళ్ల క్రితం నేను ఎక్కిన విమానం కూలినట్లు కల రావడంతో.. కొన్నాళ్ల పాటు విమానం ఎక్కాలంటే భయపడ్డాను. ఇవి నమ్మాలో లేదో తెలియదు కానీ..ఒక్కోసారి వచ్చిన కలలు నన్ను ఇలా భయపెడతాయి’ అని సుమ చెప్పుకొచ్చింది. అలాగే తనపై వచ్చిన విడాకుల రూమర్స్పై కూడా సుమ స్పదించారు.
‘మా 25 ఏళ్ల వివాహ బంధంలో ఎన్నో ఒడుదుడుకులను చూశాం. భార్యబర్తల అన్నాక..ఏదోఒక అంశంపై మనస్పర్థలు రావడం సహజం. జీవితం ఎవరికీ సాఫీగా సాగదు. ఒక సమయంలో మీమిద్దరం విడాకులు తీసుకున్నట్లు వార్తలు రాశారు. దాన్ని మేమిద్దరం ఖండించినా కూడా పుకార్లు ఆగలేదు. మేమిద్దరం కలిసి రీల్స్ చేసినా కూడా.. ‘ఏంటి ఇంకా కలిసే ఉన్నారా? విడిపోలేదా?’ అని కామెంట్స్ చేశారు. అప్పట్లో అవి చూసి బాధపడ్డాం కానీ ఇప్పుడు అయితే పట్టించుకోవడమే లేదు’ అని సుమ చెప్పుకొచ్చారు.


