
రీసెంట్‌గా కన్నడలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమా 'సు ఫ్రమ్ సో'(సులోచన ఫ్రమ్ సోమేశ్వరం). రూ.4 కోట్లు పెడితే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ ఇప్పుడు అదే పేరుతో విడుదల చేశారు. తాజాగా (ఆగస్టు 08న) థియేటర్లలోకి వచ్చిన ఈ హారర్ కామెడీ మూవీ ఎలా ఉంది? అంతలా నవ్వించిందా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథేంటి?
కర్ణాటక తీరప్రాంతంలోని ఓ పల్లెటూరు. అశోక్(జేపీ తుమినాడు) అనే కుర్రాడికి ఓ రోజు దెయ్యం పడుతుంది. దగ్గరలోని సోమేశ్వరం అనే ఊరికి చెందిన సులోచన అనే దెయ్యమే ఇతడికి ఆవహించిందని ఊరి ప్రజలందరూ అనుకుంటారు. దీంతో ఎలాగైనా సరే ఈ దెయ్యాన్ని వదిలించాలని ఊరి పెద్ద రవన్న (షనీల్ గౌతమ్).. ఓ స్వామిజీని(రాజ్ బి శెట్టి) తీసుకొస్తాడు. ఆత్మని వదిలించే క్రమంలో ఇది కాస్త ఊరి సమస్యగా మారుతుంది. ఇంతకీ ఆ యువకుడికి నిజంగానే దెయ్యం పట్టిందా? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
ఒక్క ముక్కలో చెప్పాలంటే 'సు ఫ్రమ్ సో' చాలా సింపుల్ స్టోరీ. ఓ పల్లెటూరిలో ఉండే కుర్రాడికి దెయ్యం పడుతుంది. దాన్ని వదిలించేందుకు ఊరంతా చేసే ప్రయత్నమే కథ. వినడానికి చాలా సింపుల్‌గా ఉంది కదా! కానీ రెండున్నర గంటల పాటు నాన్‌స్టాప్‌గా నవ్వించారు. మూవీ ప్రారంభంలోనే ఊరు, ఊరి జనాల స్వభావాలని పరిచయం చేసి అసలు కథలోకి తొందరగానే తీసుకెళ్లిపోయారు.
నిజానికి సినిమాలో దెయ్యం అనేది అబద్ధం అనే సంగతి చూస్తున్న ప్రేక్షకుడికి ముందే చూపించేస్తారు. కానీ అది ఉందేమోనని భ్రమపడుతూ, ఊరి ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే మనం చాలానే ఎంజాయ్ చేస్తాం. అంతలా కథ ఎంగేజ్ చేస్తుంది. సాధారణంగా హారర్ సినిమాల్లో దెయ్యం ఎవరు? ఎందుకు ఆత్మలా మారింది లాంటి విషయాల్ని చివరలో రివీల్ చేస్తారు. కానీ ఈ సినిమాలో అలా చేయలేదు. అది ఓ రకంగా ప్లస్ అయిందని చెప్పొచ్చు.
అశోక్ ఓ అమ్మాయికి సైట్ కొడుతుంటాడు. కానీ ఓ సందర్భంలో చేయరాని తప్పు చేస్తాడు. ఈ క్రమంలోనే ఊరిలో వాళ్లకు దొరికిపోతానేమో అని భయపడి, ఆ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు దెయ్యం నాటకం ఆడతాడు. కానీ ఈ ప్లాన్ బెడిసికొట్టి, వ్యవహారం మొత్తం ఎక్కడికో వెళ్లిపోతుంది. అక్కడి నుంచి ఎలాంటి టర్న్స్, ట్విస్టులు చోటుచేసుకున్నాయనేది మిగతా స్టోరీ.

సినిమా ప్రారంభం నుంచే కామెడీతో కడుపుబ్బా నవ్విస్తారు. సెకండాఫ్‌కి వచ్చేసరికి ఓవైపు నవ్విస్తూనే మరోవైపు ప్రస్తుత సమాజంలో ఒంటరి మహిళలు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారనే సీరియస్ విషయాన్ని చూపిస్తారు. అలా నవ్విస్తూ, ఎమోషనల్ చేస్తూ, ఆలోచింపజేస్తూ ముగిస్తారు. చివరగా ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ కలిగిస్తారు. కాకపోతే తీసుకున్న పాయింట్ చాలా చిన్నది. స్టోరీ అక్కడక్కడే తిరుగుతుంటుంది కాబట్టి కాస్త బోరింగ్‌గానూ అనిపిస్తుంది.
ఎవరెలా చేశారు?
ఈ సినిమాలో నటించిన ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు కాదు. కానీ సినిమాలో ఒక్కసారి ఇన్వాల్వ్ అయిపోతే ఆ విషయమే మర్చిపోతాం. మనం కూడా ఆ ఊరిలో ఉన్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది. అంతా సహజంగా నటించారు. అశోక్ అనే పాత్రలో నటించిన జేపీ తుమినాడ్.. ఈ సినిమాకు డైరెక్టర్ కూడా. సింపుల్ పాయింట్ తీసుకుని తనదైన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. పాత్రల డిజైనింగ్ బాగుంది.
ముఖ్యంగా డ్రింకర్ బావ అని ఓ పాత్ర చాలా హిలేరియస్‌గా ఉంటుంది. అతడు కనిపించినప్పుడల్లా.. 'వచ్చాడు వచ్చాడు బావ వచ్చాడు' అని పాట ప్లే అవుతూ ఉంటుంది. భలే కామెడీగా అనిపిస్తుంది. టెక్నికల్‌గానూ ఈ సినిమా బాగుంది. థియేటర్‌కి వెళ్లి సరదా నవ్వుకోవాలి అంటే కచ్చితంగా ఈ సినిమా చూడండి.
రేటింగ్: 2.75/5
- చందు డొంకాన