‘‘కమర్షియల్ హంగులతో కూడిన హీరో సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూనే, నటనకు స్కోప్ ఉండే ఫిమేల్ సెంట్రిక్ చిత్రాల్లోనూ నటించాలని ఉంది. ఏ జానర్ సినిమా అయినా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే మంచి కథలు, ప్రాముఖ్యత ఉన్న పాత్రలు లభిస్తే సినీ పరిశ్రమలో నటీమణుల భవిష్యత్ ఎప్పుడూ సక్సెస్ బాటలోనే కొనసాగుతుంది. ఇక ఒక నటిగా అన్ని రకాల పాత్రల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించాలన్నదే నా లక్ష్యం’’ అని హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెప్పారు.
‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీనిధి శెట్టి తెలుగులో నాని ‘హిట్: ది థర్డ్ కేసు’, సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ వంటి సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా వెంకటేశ్ హీరోగా నటించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో హీరోయిన్‌గా నటించారు శ్రీనిధి శెట్టి. చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ మనుగడ, రాణింపు వంటి విషయాల గురించి శ్రీనిధి శెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
⇒ కథ మొత్తం హీరో పాత్ర చుట్టూ తిరుగుతున్నప్పుడు, ఇందులోని ఇతర పాత్రలు కూడా హీరో క్యారెక్టర్స్ చుట్టూనే తిరుగుతుంటాయనేది సహజం. అయితే ప్రతి సినిమాలోనూ ఇదే పరిస్థితి ఉండకపోవచ్చు. ‘కేజీఎఫ్’ సినిమాలో నేను రీనా దేశాయ్ అనే పాత్రలో నటించాను. ఈ చిత్రంలో హీరో క్యారెక్టర్‌కు పెద్ద స్థాయిలో ఎలివేషన్ ఉంది. కథ రీత్యా యాక్షన్ సన్నివేశాలకే ఎక్కువ స్కోప్ ఉంది. అయితే నా పాత్ర కూడా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. ఈ తరహా బ్యాలెన్స్ కొన్ని సినిమాలకు బాగుంటుంది. పాత్ర నిడివితో సంబంధం లేకుండా... ఒక పెద్ద సినిమాలో భాగం కావడం, ఒక నటిగా ప్రేక్షకుల్లో బలమైన ముద్రగా వేయడం నాకు ముఖ్యమే.
⇒ ఒకప్పుడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితమైన హీరోయిన్స్ ఇప్పుడు కథ మొత్తాన్ని తామే మోసే స్థాయికి ఎదగడం మంచి పరిణామం. అలాగే పరిశ్రమలో స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్స్ సైతం డీ–గ్లామర్స్ రోల్స్ చేస్తున్నారు. ఇటు నటనకు స్కోప్ ఉన్న విలక్షణమైన, వైవిధ్యంతో కూడిన పాత్రలను చేసేస్తున్నారు. సినిమా పరిశ్రమలో హీరోయిన్స్‌కు సముచిత స్థానం లభిస్తుందనడానికి ఇది ఒక శుభ సూచికంగా చెప్పుకోవచ్చు.


