భారతీయుల గుండెల్లో చెరగని ముద్రవేసిన పురాణ గాథలకు సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మరోసారి సరికొత్త రూపం ఇవ్వబోతోంది. ఒకప్పుడు ‘రామాయణ్’, ‘శ్రీ కృష్ణ’ వంటి సీరియళ్లతో దేశ టీవీ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన సాగర్ కుటుంబం.. ఇప్పుడు వెండితెరపై మరింత భారీ స్థాయిలో ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ‘శ్రీమద్భాగవతం: పార్ట్ వన్ – విష్ణురథ’ పేరుతో లైవ్-యాక్షన్ సినిమాటిక్ సాగా రూపుదిద్దుకుంటోంది. మొత్తం ఏడు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు ప్రకటించారు.
శ్రీమద్భాగవత మహాపురాణం విస్తృతమైన కథా ప్రపంచాన్ని కలిగి ఉంది. ఇంతటి విస్తారమైన కథని ఒకే సినిమాలో చెప్పడం కంటే ఏడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతను మరింత పెంచుతోంది. ‘విష్ణురథ’ ఈ ఏడు భాగాల ప్రయాణానికి తొలి అధ్యాయం కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు ఆకాశ్ సాగర్ చోప్రా, అమృత్ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామానంద్ సాగర్ కుటుంబానికి చెందిన ఈ తదుపరి తరం దర్శకులు ఇప్పుడు కుటుంబ వారసత్వాన్ని కొత్త తరహా సినిమా భాషతో ముందుకు తీసుకెళ్లే బాధ్యతను స్వీకరించారు.


