breaking news
Srimadbhagavatam
-
మన వెన్నంటి చిన్నికృష్ణుడు...
లోక కల్యాణం కోసం శ్రీహరి ధరించిన దశావతారాలలో రామావతారం తర్వాత మళ్లీ అంతటి పరిపూర్ణమైన అవతారం శ్రీ కృష్ణావతారమే. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’’.... అని శ్రీమద్భాగవతం శ్రీ కృష్ణుడే భగవంతుడు అని చెబుతుంది. శ్రీ కృష్ణ భగవానుడి లీలల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా.. ఎంత విన్నా భక్తుడి హృదయం పరవశిస్తూనే ఉండటం విశేషం. మన జీవితాలను, సమస్త కర్మలను దేవదేవుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మకు పునరంకితం చేయమని కృష్ణాష్టమి పర్వదినం మనకు గుర్తు చేస్తుంది.శ్రీ నందన నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష బుుతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీ వసుదేవులకు స్వయంగా శ్రీ మహావిష్ణువే కృష్ణుని గా జన్మించాడు.అందరికీ అన్నీ తానే అయి....మన పురాణాలలోను, తాత్త్విక గ్రంథాలలోను, జనబాహుళ్యంలోని గాథలలోను, సాహిత్యంలోను, ఆచార పూజాసంప్రదాయాలలోనూ కృష్ణుని చిలిపి బాలునిగాను, పశువులకాపరి గాను, రాధా మనోహరునిగాను, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథియైన పాండవ పక్షపాతిగాను, భగవద్గీతా ప్రబోధకునిగాను, తత్త్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రిక రాజనీతిజ్ఞునిగానూ... ఇలా అనేక విధాలుగా శ్రీ కృష్ణుని చిత్రీకరిస్తుంటారు. అంతేకాదు, శ్రీ కృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం గురించి ఎన్నో విధాలుగా చదువుతుంటాం. అయినా ఆ కృష్ణుని గురించి తెలుసుకోవలసిన విశేషాలెన్నో ఉంటూనే ఉంటాయి.వెన్న దొంగ ఎందుకయ్యాడు?చిన్ని కృష్ణుడు చిలిపి కృష్ణునిగానూ, వెన్న దొంగగానూ పేరు పొందాడు. అలా వెన్న ముద్దల దొంగతనంలో దేవరహస్యం ఏమంటే... వెలుగుకు, విజ్ఞానానికి సంకేతమైన వెన్న, చీకటికి, అజ్ఞానానికి సంకేతమైన నల్లని కుండలలో ఉండేది, తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడని భాగవత లీలలు చెబుతున్నాయి.నీవే తల్లివి దండ్రివి నీవే నా తోడు నీడ! నీవే సఖుడౌనీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు! నిజముగ కృష్ణా!స్మార్తులు తిథితో పండగ జరుపుకుంటే, వైష్ణవులు నక్షత్రమే ప్రధానంగా తీసుకుంటారు.ఎలా జరుపుకోవాలంటే...కృష్ణాష్టమి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. తర్వాత ఇంటిని, పూజామందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు అలంకరించి పూజామందిరంలో ముగ్గులు వేయాలి.ఇక ఈ పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి భాగవత పురాణాన్ని లేదా శ్రీ కృష్ణ లీలలను పారాయణ చేస్తూ గడుపుతారు. సాయంత్రం వేళ విధి విధానాలతో శ్రీ కృష్ణుని పూజిస్తారు. అనంతరం ఈ మాసంలో లభించే పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడలను నైవేద్యం పెడతారు. రాత్రి కాగానే ఊయలలు కట్టి అందులో శ్రీ కృష్ణ విగ్రహాల్ని పవళింపజేసి ఊపుతూ పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఉట్లు కట్టి పోటీపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అనీ పిలుస్తారు. వేణుమాధవుడు...కృష్ణుడు వేణువును విడిచి పెట్టి క్షణం కూడా ఉండలేడు. వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే... చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కృష్ణుడు తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. చివరికి అందరూ కలిసి నువ్వంటే కృష్ణుడికి ఎందుకంత ఇష్టమని వేణువుని అడిగితే.. ‘నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అని చెప్పిందట వేణువు. నిజమే కదా! వేణువు అంటే, పరిపూర్ణతకు చిహ్నం. తన మనసులో ఏ మాలిన్యమూ, భావమూ, వికారమూ లేదు. తన సర్వస్వాన్నీ పరమాత్మకు అర్పించుకుంది. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే.– డి.వి.ఆర్. -
కొత్త పుస్తకాలు
కొత్త పుస్తకాలు వేకువ కథారచన: కూర చిదంబరం; పేజీలు: 136; వెల: 100; ప్రతులకు: సౌమిత్రి ప్రచురణలు, 6-1-118/19, పద్మారావు నగర్, సికింద్రాబాద్-25; ఫోన్: 8885552423 ‘రచయిత కూర చిదంబరం తన అనుభవాల్నీ, ఆలోచనల్నీ ఈ కథల్లో వ్యక్తం చేశారు. ఇవి ఒక అనుభవజ్ఞుడి కోణంలోంచి దర్శించి వ్రాసిన కథలు. నిత్య జీవితంలో కనిపించే పాత్రల్ని రచనా సామర్థ్యంతో తన కథల్లోకి లాక్కున్నారు’. ‘పట్టువిడుపుల ఒడుపూ, కథానికా ప్రయోజనం, ప్రాధాన్యమూ తెలుసు ఈ రచయితకి. కథలన్నింటా మానవ సంబంధాల్లోని వైరుధ్యాల చిత్రణ పదునుదేరి ఉన్నది’. శ్రీమద్భాగవతమ్ అనువాదం: డాక్టర్ నల్లంతిగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు; పది భాగాలు; వెల: 1200; ప్రతులకు: ఎన్.రంగనాయకమ్మ, 7-1-110, రెడ్డి ఎన్క్లేవ్, దేవుని అల్వాల, హైదరాబాద్-10; ఫోన్: 9247355355 ‘మూలమాత్రంగా ముద్రిస్తే, ఏ కొందరికో ఉపయోగిస్తుంది. కావున సరళమైన తాత్పర్యంతో వేస్తే, చాలామందికి ఉపయోగపడుతుంద’న్న సలహా మేరకు అనువాదకుడు ‘వేదవ్యాస మహర్షి విరచిత’ శ్రీమద్భాగవతమ్కు చేసిన తెలుగు అనువాదం ఇది. సుమారు 18 వేల శ్లోకాలకు తాత్పర్యం చెప్పారు. నాగలిజాడ సంపాదకుడు: అట్టాడ అప్పలనాయుడు; పేజీలు: 190; వెల: 150; ప్రతులకు: గంటేడ కిరణ్‌కుమార్, ఎస్.ఎన్.పి. కాలనీ, రామమందిరం దరి, బెలగాం, పార్వతీపురం; ఫోన్: 9441415182 ‘కళింగాంధ్ర సాహిత్య ప్రపంచంలో తొలినుంచి విస్పష్టమైన గొంతుతో రైతు జీవితగాథను కథాగానం చేస్తున్న గంటేడ గౌరునాయుడుగారి షష్టిపూర్తికి’ సిక్కోలు బుక్ ట్రస్ట్ తెచ్చిన పుస్తకం ఇది. ‘కథ, కవిత, పాట, యాసపీఠం అనే కాలం... రచనలతో గౌర్నాయుడు సృజించిన సాహిత్యాన్ని, గౌర్నాయుడు జీవించిన కళింగ సమాజాన్ని వారివారి దృష్టికోణాలనుంచి చూపిస్తారిందులో వ్యాసకర్తలు’. తెలంగాణార్థం రచన: ఎన్.వేణుగోపాల్; పేజీలు: 286; వెల: 150; ప్రతులకు: వీక్షణం, మైత్రీ రెసిడెన్సీ, 3-6-394, స్ట్రీట్ నం. 3, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29; ఫోన్: 040-66843495 ‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, విద్యావిధానం, పౌరహక్కులు, కార్మికులు, రైతులు, దళితులు, నిరుద్యోగం, ఉద్యోగకల్పన వంటి ఎన్నో రంగాలలో గత రెండు సంవత్సరాల తెలంగాణ పాలనా విధానాలపై ఎన్.వేణుగోపాల్ వివిధ పత్రికలలో రాసిన విమర్శా వ్యాసాల సంకలనం ఇది’.


