మర్కెట్ లోకి కొత్త పుస్తకాలు వచ్చాయి.
కొత్త పుస్తకాలు
వేకువ
కథారచన: కూర చిదంబరం; పేజీలు: 136; వెల: 100; ప్రతులకు: సౌమిత్రి ప్రచురణలు, 6-1-118/19, పద్మారావు నగర్, సికింద్రాబాద్-25; ఫోన్: 8885552423
‘రచయిత కూర చిదంబరం తన అనుభవాల్నీ, ఆలోచనల్నీ ఈ కథల్లో వ్యక్తం చేశారు. ఇవి ఒక అనుభవజ్ఞుడి కోణంలోంచి దర్శించి వ్రాసిన కథలు. నిత్య జీవితంలో కనిపించే పాత్రల్ని రచనా సామర్థ్యంతో తన కథల్లోకి లాక్కున్నారు’. ‘పట్టువిడుపుల ఒడుపూ, కథానికా ప్రయోజనం, ప్రాధాన్యమూ తెలుసు ఈ రచయితకి. కథలన్నింటా మానవ సంబంధాల్లోని వైరుధ్యాల చిత్రణ పదునుదేరి ఉన్నది’.
శ్రీమద్భాగవతమ్
అనువాదం: డాక్టర్ నల్లంతిగళ్ లక్ష్మీ నరసింహాచార్యులు; పది భాగాలు; వెల: 1200; ప్రతులకు: ఎన్.రంగనాయకమ్మ, 7-1-110, రెడ్డి ఎన్‌క్లేవ్, దేవుని అల్వాల, హైదరాబాద్-10; ఫోన్: 9247355355
‘మూలమాత్రంగా ముద్రిస్తే, ఏ కొందరికో ఉపయోగిస్తుంది. కావున సరళమైన తాత్పర్యంతో వేస్తే, చాలామందికి ఉపయోగపడుతుంద’న్న సలహా మేరకు అనువాదకుడు ‘వేదవ్యాస మహర్షి విరచిత’ శ్రీమద్భాగవతమ్‌కు చేసిన తెలుగు అనువాదం ఇది. సుమారు 18 వేల శ్లోకాలకు తాత్పర్యం చెప్పారు.
నాగలిజాడ
సంపాదకుడు: అట్టాడ అప్పలనాయుడు; పేజీలు: 190; వెల: 150; ప్రతులకు: గంటేడ కిరణ్‌కుమార్, ఎస్.ఎన్.పి. కాలనీ, రామమందిరం దరి, బెలగాం, పార్వతీపురం; ఫోన్: 9441415182
‘కళింగాంధ్ర సాహిత్య ప్రపంచంలో తొలినుంచి విస్పష్టమైన గొంతుతో రైతు జీవితగాథను కథాగానం చేస్తున్న గంటేడ గౌరునాయుడుగారి షష్టిపూర్తికి’ సిక్కోలు బుక్ ట్రస్ట్ తెచ్చిన పుస్తకం ఇది. ‘కథ, కవిత, పాట, యాసపీఠం అనే కాలం... రచనలతో గౌర్నాయుడు సృజించిన సాహిత్యాన్ని, గౌర్నాయుడు జీవించిన కళింగ సమాజాన్ని వారివారి దృష్టికోణాలనుంచి చూపిస్తారిందులో వ్యాసకర్తలు’.
తెలంగాణార్థం
రచన: ఎన్.వేణుగోపాల్; పేజీలు: 286; వెల: 150; ప్రతులకు: వీక్షణం, మైత్రీ రెసిడెన్సీ, 3-6-394, స్ట్రీట్ నం. 3, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29; ఫోన్: 040-66843495
‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, విద్యావిధానం, పౌరహక్కులు, కార్మికులు, రైతులు, దళితులు, నిరుద్యోగం, ఉద్యోగకల్పన వంటి ఎన్నో రంగాలలో గత రెండు సంవత్సరాల తెలంగాణ పాలనా విధానాలపై ఎన్.వేణుగోపాల్ వివిధ పత్రికలలో రాసిన విమర్శా వ్యాసాల సంకలనం ఇది’.


