ప్రముఖ ఎడిటర్ శ్రీకర ప్రసాద్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ (ఆస్కార్ అకాడమీ) సభ్యునిగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆయనకు అధికారిక ఆహ్వానం అందింది. దివంగత దర్శక–నిర్మాత ఎల్.వి. ప్రసాద్ సోదరుడు, దర్శకుడు–ఎడిటర్ అయినటువంటి అక్కినేని సంజీవి తనయుడు శ్రీకర ప్రసాద్.
తండ్రి మార్గంలో ఎడిటర్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీకర ప్రసాద్ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ తన ప్రతిభను చాటారు. ఈ ఏడాది ఆస్కార్ అకాడమీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 529 మందిని కొత్త సభ్యులుగా తీసుకుంది.
వారిలో శ్రీకర ప్రసాద్‌కూ చోటు దక్కడం విశేషం. ఆస్కార్ నామినేషన్స్‌కు వచ్చే సినిమాలకు ఓటు వేసే అవకాశం ఆయనకు లభించింది. సుమారు 600లకు పైగా చిత్రాలకు ఎడిటర్‌గా చేసిన శ్రీకర ప్రసాద్ 9 జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు. ఆస్కార్ అకాడమీలో సభ్యునిగా స్థానం సొంతం చేసుకున్న ఆయనకు పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.


